గాంధీభవన్ మెట్లపై పొన్నాల, దామోదర నిరసన

గాంధీభవన్ మెట్లపై పొన్నాల, దామోదర నిరసన

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో డెలిగేట్ల ఓట్ల విషయంలో గందరగోళం చెలరేగింది. సోమవారం గాంధీభవన్‌‌‌‌ మీడియా హాల్‌‌‌‌లో ఉదయం 10 గంటల నుంచి 4 వరకు పోలింగ్ జరిగింది. 119 నియోజకవర్గాల నుంచి 238 మంది సభ్యులకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. కొంత మందికి కార్డులిచ్చి ఓటు లేదనడంపై మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ ఫైర్​ అయ్యారు. గాంధీ భవన్​ మెట్లపై కూర్చుని నిరసన తెలిపారు. కాగా, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక నాయకుల సహకారంతో ప్రశాంతంగా ముగిసిందని రిటర్నింగ్ ఆఫీసర్ రాజ్ మెహన్ ఉన్నితన్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 226 మంది ఓటు వేశారన్నారు.

గాంధీ భవన్​ దగ్గర నిరసన

రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు డెలిగేట్లకు ఓటు వేసేందుకు కార్డులు ఇచ్చారు. జనగామ నుంచి పొన్నాల, చెంచారపు శ్రీనివాస్ రెడ్డికి కార్డులు ఇచ్చారు. కానీ ఓటర్ జాబితాలో శ్రీనివాస్ రెడ్డి పేరు తొలగించి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును ఆదివారం రాత్రి చేర్చారని తెలిసింది. ఓటు వేసేందుకు  గాంధీ భవన్‌‌‌‌కు పొన్నాల, శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి వచ్చారు. కొమ్మూరి పేరు చేర్చడంపై మండిపడ్డ పొన్నాల.. శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే చాన్స్​ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో సీనియర్ నేత జానారెడ్డి సర్దిచెప్పారు. నారాయణఖేడ్‌‌‌‌కు చెందిన వ్యక్తికి కార్డు ఇచ్చి, ఓటు లేదని చెప్పడంపై దామోదర మండిపడ్డారు. గాంధీ భవన్ మెట్ల దగ్గర దామోదర, పొన్నాల, సంజీవ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ధర్నా చేశారు. దీంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మరో ఎంట్రీ నుంచి ఓటింగ్ హాల్‌‌‌‌కు వెళ్లారు.

కార్యకర్తల్ని అవమానించడమే: దామోదర

ఇటీవల పీసీసీ డెలిగేట్ కార్డు ఇచ్చారని, పోలింగ్‌‌‌‌ సందర్భంగా వస్తే ఓటు లేదని చెబుతున్నారని దామోదర రాజనర్సింహ ఫైర్ అయ్యారు. కార్డు ఇచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటు లేదని చెప్పడం దారుణమన్నారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల్ని అవమానించడమేనన్నారు. ఓటు వేయటానికి వస్తే శ్రీనివాస్‌‌‌‌రెడ్డికి అవకాశం ఇవ్వలేదని పొన్నాల మండిపడ్డారు. 

పీసీసీకి సంబంధం లేదు: రేవంత్

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలో కొందరికి ఓటు హక్కు లేకపోవడంపై రేవంత్ స్పందించారు. ‘‘ఈ ఎన్నికలను ఒక అటానమస్ బాడీ నిర్వహిస్తుంది. పీసీసీకి సంబంధం లేదు” అని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి వ్యాఖ్యలను అధిష్టానమే పరిశీలిస్తుందన్నారు. కారును పోలిన గుర్తులను తొలగించాలని కోర్టుకు టీఆర్ఎస్ వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు.