ఆటో చార్జీలు పెంచేందుకు పర్మిషన్ ఇయ్యం ; పొన్నం ప్రభాకర్

ఆటో చార్జీలు పెంచేందుకు పర్మిషన్ ఇయ్యం ; పొన్నం ప్రభాకర్
  •     అధైర్యపడొద్దు.. కచ్చితంగా ఆదుకుంటాం: పొన్నం

హైదరాబాద్, వెలుగు: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్రాన్స్​పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అధైర్యపడొద్దని, కచ్చితంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆటో వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చిస్తున్నామన్నారు. ఆటో చార్జీలు పెంచుకోవడానికి తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించదని తేల్చి చెప్పారు. కర్నాటక, కేరళ, రాజస్థాన్​లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు.

ఆటో పర్మిట్లు, ఇన్సూరెన్స్ లు, వెల్ఫేర్ సొసైటీకి సంబంధించిన లిఖితపూర్వక సూచనలు ఇవ్వాలని సంఘాల నేతలకు సూచించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గురువారం సెక్రటేరియెట్​లో ఆటో యూనియన్ల నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్ తో పాటు పలు యూనియన్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభించిన తర్వాత ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అని పొన్నం ప్రభాకర్ అన్నారు. పోయిన ఏడాది 22వేల ప్రమాదాలు జరిగాయని, మూడు వేల మంది చనిపోయారని, రోడ్ సేఫ్టీ విషయంలో అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తర్వాత ఆటో యూనియన్ నేతలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఈఎస్ఐతో కూడిన ఆటో మోటారు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేల ఆర్థిక సహాయం చేయాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ లో కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని కోరారు.