హైదరాబాద్ లో 5 వేల బోర్లు ఎండిపోయినయ్... ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి: మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్ లో  5 వేల బోర్లు ఎండిపోయినయ్... ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి: మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • నీటి భద్రతకు వర్షపు నీటి సంరక్షణే శాశ్వత పరిష్కారం
  • రెయిన్‌‌‌‌‌‌‌‌ వాటర్ హార్వెస్టింగ్ ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపు

హైదరాబాద్​సిటీ, వెలుగు:  హైదరాబాద్​ నగరానికి నీటి ఎద్దడి రాబోతున్నదని, దీనిని  ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి చేసుకోవాలని జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​ పిలుపునిచ్చారు. నగరంలో 4 వేల నుంచి 5 వేల బోర్లు ఇప్పటికే పూర్తిగా ఎండిపో యాయని పేర్కొన్నారు. వాటిని రీచార్జి చేయడానికే ఇంజెక్షన్​బోర్​వెల్స్​గా మారుస్తున్నట్టు చెప్పారు. భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఇల్లు, అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, విద్యాసంస్థలు నడుంబిగించాలని కోరారు.  

సైఫాబాద్‌‌‌‌‌‌‌‌లోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్​ సైన్స్‌‌‌‌‌‌‌‌లో మెట్రోవాటర్​బోర్డు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వర్షపు నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణంలోని ఎండిపోయిన బోర్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ను ఇంజెక్షన్ బోర్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌గా పునరుద్ధరించిన రీచార్జ్ పిట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. వర్షపు నీటిని ఎండిపోయిన బోర్లలోకి మళ్లించడం ద్వారా వాటికి పునర్జీవం కల్పించవచ్చని పేర్కొన్నారు. 

వాటర్​బోర్డు చేపడుతున్న వర్షపు నీటి సంరక్షణ ఉద్యమంలో పాల్గొని, ప్రతి ఇంటిలో రెయిన్‌‌‌‌‌‌‌‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చే మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వర్షపు నీరు  డ్రైనేజీల్లోకి వెళ్లకుండా ఒడిసిపట్టుకోవాలని సూచించారు.  హైదరాబాద్ మహానగరంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరగడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశాలు గణనీయంగా తగ్గాయన్నారు. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2016 నుంచే కొత్త భవనాల్లో రెయిన్‌‌‌‌‌‌‌‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను తప్పనిసరి చేసిందని తెలిపారు. అయినా.. ఇప్పటికే ఉన్న గృహాలు, అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు కూడా స్వచ్ఛందంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాగా,  ప్రస్తుతం వర్షాలు పూర్తిగా నిలిచిపోతే నగరానికి నీటిని అందించే జలాశయాల్లోని నిల్వలు సుమారు 80 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతాయని మెట్రోవాటర్​బోర్డు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ జలాశయాలపై దాదాపు 3 లక్షల కనెక్షన్లు ఆధారపడి ఉన్నాయని, భవిష్యత్తులో వారికి నీటి సరఫరా కొనసాగించడం పెద్ద సవాల్​గా మారుతుందన్నారు. 

మాసాబ్ ట్యాంక్ లోనూ..

మాసాబ్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌లోని గోల్డెన్ టవర్స్‌‌‌‌‌‌‌‌లో అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌వాసులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న రెయిన్‌‌‌‌‌‌‌‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ప్రతి గేటెడ్ కమ్యూనిటీ, ప్రతి అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్, ప్రతి కాలనీ ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. 

రెయిన్‌‌‌‌‌‌‌‌వాటర్ హార్వెస్టింగ్‌‌‌‌‌‌‌‌ను సమర్థవంతంగా అమలు చేసిన 100 ఉత్తమ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు లేదా గేటెడ్ కమ్యూనిటీలను గుర్తించి, వారికి ‘బెస్ట్ రెయిన్‌‌‌‌‌‌‌‌వాటర్ హార్వెస్టింగ్ అవార్డులు’ ప్రదానం చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని వాటర్​బోర్డు అధికారులకు మంత్రి సూచించారు.