- డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం
- బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వారు అలయ్ బలాయ్ తీసుకొని ఒకరికొకరికి ఇబ్బంది లేకుండా అభ్యర్థులను పోటీలో నిలిపారని విమర్శించారు. తాము ఎంఐఎంతో కుమ్మక్కయ్యామని మాట్లాడుతున్నారని, ఆధారాలు ఉంటే నిరూపించాలని కానీ అర్థరహితమైన ఆరోపణలు మంచిది కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి హితవు పలికారు.
కరీంనగర్ డీసీసీ ఆఫీసులో సోమవారం ఆయన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆశీర్వదించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత లోపించిందని, స్మార్ట్ సిటీ మెయిన్ రోడ్లకే పరిమితమైందన్నారు. కేంద్ర నిధులు ఖర్చు చేయడంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడంలో కేంద్ర మంత్రి విఫలమయ్యారని, అవినీతికి పాల్పడిన మేయర్‌ను పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు భూములు కబ్జా పెడితే తాము వచ్చిన తర్వాత వారిని జైలుకు పంపినట్లు గుర్తు చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదన్నారు.
గత ప్రభుత్వం, ఇప్పుడున్న కేంద్ర మంత్రి కరీంనగర్ డంపింగ్ యార్డు తరలించే ప్రయత్నం చేయలేదని, తాము శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అనంతరం 9,10,39 వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థులు పడిశెట్టి వసంత లక్ష్మీ, కోడూరి రవీందర్ గౌడ్, వేముల శ్రీనివాస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎలాంటి మచ్చ లేని నాయకులని, అభివృద్ధి కోసం వారిని గెలిపించాలని కోరారు. లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్ రాహుల్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాజశేఖర్ , అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
