పదేండ్లు ఆర్టీసీని నాశనం చేసిండ్రు: పొన్నం

పదేండ్లు ఆర్టీసీని నాశనం చేసిండ్రు: పొన్నం
  •     15 కోట్ల మంది మహిళలు ఫ్రీ జర్నీ చేసిన్రు: పొన్నం 

హైదరాబాద్, వెలుగు:  పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పీఆర్సీలు, డీఏ బకాయిలు ఇవ్వలేదన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం శుక్రవారం కౌంటర్ ఇచ్చారు.  మహాలక్ష్మి స్కీమ్ కింద కోట్లాది మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ చేశారని, రూ. 535 కోట్ల మొత్తం ఆర్టీసీకి లబ్ధి జరిగిందన్నారు. ఆర్టీసీ కార్మికులు 60 రోజులు సమ్మె చేసి, ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు పట్టించుకోలేదని పల్లాను మంత్రి ప్రశ్నించారు. ఇంకా తామే అధికారంలో ఉన్నామని, ఏం చెప్తే అది వినాలె అనే ఫీలింగ్ లో ఆయన ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15,000 ఇవ్వాలని హరీశ్ అంటున్నారని, వారి హయాంలో ఎందుకు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు.

 ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చలాన్ల పేరుతో వేల రూపాయలు వసులు చేశారన్నారు. సభను తప్పుదోవ పట్టించేలా 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారని, వారిని బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తామన్నారు. ఆర్టీసీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా గతంలో సీఎం బంధువు ఉన్నారని, రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన నాలుగేండ్లు ఎండీగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు గత పదేండ్లలో ఆర్టీసీ ల్యాండ్స్ లీజుకు తీసుకుని బిజినెస్ లు చేశారని, బకాయిలు కట్టలేదన్నారు. కాగా ఆర్టీసీలో మరో 85 బస్సులు రోడ్ల మీదకు రానున్నాయి.  శనివారం అంబేద్కర్ విగ్రహం దగ్గర సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రారంభించనున్నారు.