పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ పార్టీలకు బుద్ధి చెప్పాలి: పొన్నం

పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ పార్టీలకు బుద్ధి చెప్పాలి: పొన్నం
  •     నాగ్ పూర్ సభకు తెలంగాణ నుంచి లక్ష మంది జన సమీకరణ
  •     రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఆర్థికంగా విచ్ఛిన్నం చేసింది
  •     మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్

ఆదిలాబాద్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ పార్టీలకు బుద్ధి చెప్పాలని.. ముఖ్యంగా మతం, కులాల పేర సమాజాన్ని విడగొడ్తున్న బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ నెల28న మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగే కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి సోమవారం ఆదిలాబాద్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్​గౌడ్ హాజరయ్యారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని..ఇందుకు నిదర్శనం ఇక్కడున్న సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించకపోవడమేనన్నారు. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి తీరతామన్నారు. మహాలక్ష్మి పథకంతో ఇప్పటి వరకు నాలుగు కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేశారన్నారు.  

స్వేదపత్రం పేరుతో బీఆర్ఎస్ నాటకాలు : మంత్రి పొన్నం

ప్రజల్ని తప్పుదారి పట్టించి తమ అక్రమాలు, తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే స్వేదపత్రం పేరిట బీఆర్ఎస్ నాటకాలాడుతోందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్​సర్కారు ఏర్పడేనాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, శ్వేత పత్రాల ద్వారా ప్రజలకు వివరించేందకు అసెంబ్లీ సాక్షిగా ప్రయత్నిస్తే బీఆర్ఎస్ లో గుబులు మొదలైందన్నారు. నాగ్​పూర్ సభను జయప్రదం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపైనే ఉందన్నారు. స్వాతంత్ర్య పోరాటానికి బాధ్యత వహించిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. రాబోయే ఎన్నికలన్నింటీలో కాంగ్రెస్ గెలుపుకోసం కృషి చేయాలన్నారు. 

కార్యకర్తల కృషితోనే అధికారంలోకి..

రాష్ట్రంలో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు చేసిన కృషి అమూల్యమైనదని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి అన్నారు. నాగ్​పూర్ సభకు లక్ష మంది కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి జైత్రయాత్రకు శ్రీకారం చుట్టిన గడ్డ ఇంద్రవెల్లి అని, ఆనాడు మొదలైన జైత్ర యాత్ర సర్కార్ ఏర్పాటు వరకూ ఏకధాటిగా కొనసాగిందని గుర్తుచేశారు. ఈ సమాశానికి హాజరైన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను పార్టీ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఆదిలాబాద్, ముథోల్, ఆసిఫాబాద్, సిర్పూర్ టి, బోథ్ నియోజకవర్గ ఇన్​చార్జులు కంది శ్రీనివాస్ రెడ్డి, నారాయణ రావు పటేల్, శ్యాం నాయక్, రావి శ్రీనివాస్, ఆడె గజేందర్ పాల్గొన్నారు.