- ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయండి
సైదాపూర్/చిగురుమామిడి, వెలుగు: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషిచేయాలని రాష్ట్ర రవాణా బీసీ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికతో గ్రామాల స్వరూపాన్ని మార్చాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను నంబర్ వన్‌గా నిలపాలని పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో జరిగిన సన్నాహక సమావేశాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి వ్యక్తికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నవాబుపేట గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ చిత్రమిశ్రాతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, సైదాపూర్ ఏఎంసీ చైర్మన్ సుధాకర్, స్పెషల్ ఆఫీసర్లు, సర్పంచులు, కార్యదర్శులు
పాల్గొన్నారు.
