రాష్ట్ర ఆరోగ్య పథకాల్లో కేంద్ర నిధులెన్ని?

రాష్ట్ర ఆరోగ్య పథకాల్లో కేంద్ర నిధులెన్ని?

ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్య ఖర్చులు భరించలేక పేద కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతూ వీధిన పడుతున్నాయి. వారికి అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2018 సెప్టెంబర్​23న ప్రధానమంత్రి నరేంద్రమోడీ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచి నగరంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని13.44 కోట్ల పైగా పేద కుటుంబాలకు అంటే సుమారు 60 కోట్ల మందికి ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించే బృహత్తర పథకం ఆయుష్మాన్ భారత్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య పథకం ఇది. ఇప్పటివరకు దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు18 కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన కార్డ్స్ తీసుకున్నారు. 23 వేల ఆస్పత్రులు ఎంపానెల్ మెంట్ అయ్యాయి. ఇప్పటి వరకు 2,89,23,388 మంది వివిధ రకాల వ్యాధులకు చికిత్స పొందారు. ఆయుష్మాన్ భారత్ ప్రారంభమైన రెండు సంవత్సరాల ఎనిమిది నెలల తర్వాత 2021 మే18న తెలంగాణ ప్రభుత్వం ఈ పథకంలో చేరింది. అయితే రాష్ట్రంలో ఈ పథకం అమలు అవుతున్నదో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.

ఆరోగ్య యోజన కార్డులేవి?
కేంద్ర ప్రభుత్వం నుంచి జనవరి 2022 వరకు517.7 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్న రాష్ట్ర సర్కారు.. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ పేరు ప్రచారంలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నది. ఈ విషయాన్ని పార్లమెంటులో నల్గొండ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు.  ప్రస్తుతం ఆరోగ్య శ్రీ పథకం కింద కుటుంబంలోని ఒక వ్యక్తి ఏడాదిలో గరిష్టంగా రూ.1,50,000 వరకు లబ్ధిపొందవచ్చు. మరో రూ.50 వేల వరకు ఇతర సభ్యులు వైద్యం చేయించుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్‌‌లో మాత్రం ఆ షరతులు లేవు. కుటుంబం మొత్తానికి రూ.5 లక్షలైనా, లేదంటే ఒకే వ్యక్తికి రూ.5 లక్షలైనా ఉపయోగించుకోవచ్చు. లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యసేవలు పొందే వెసులుబాటు ఉంది. అన్ని రకాల చికిత్సలకు ప్రభుత్వం ముందస్తుగానే ప్రామాణిక ధరలు నిర్ణయించింది. రాష్ట్రంలో 26 లక్షల కుటుంబాలు అంటే ఒక కోటి 30 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నారు. కాగా జనవరి 2022 వరకు 2 లక్షల 39 వేల మంది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన కింద చికిత్స తీసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన కార్డులు ఇయ్యలేదు. తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకంలో లబ్ధిదారులు 949 రకాల వ్యాధులకు మాత్రమే చికిత్స పొందే వీలు ఉంది. ఆయుష్మాన్ భారత్ పథకంలో 1393 రకాల వ్యాధులకు ట్రీట్​మెంట్​తీసుకోవచ్చు. కేంద్రం నుంచి నిధులు పొందుతున్న రాష్ట్రం.. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదు. దీంతో అనేక ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లను చేర్చుకోకుండా నిరాకరిస్తున్నారు.

సర్కారు తీరు మారాలె..
ఆరోగ్య రంగంలో అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలుగా మార్చుకుని కేంద్ర ప్రభుత్వానికి ప్రచారం రాకుండా చేస్తోంది. గర్భిణులకు కేంద్రం రూ.6 వేలు మంజూరు చేస్తుంటే దానికి అదనంగా రూ. 6 వేలు కలిపి కేసీఆర్ కిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వమే రూ.12 వేలు ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటోంది. కరోనా సమయంలో వచ్చిన నిధులు, జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు, కరోనా టీకాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంది. కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఒక అంబులెన్స్ కొని దానిపై తమ ఫొటోలను ముద్రించుకుని ప్రచారం కల్పించుకుంటున్నారు. మరి వేల కోట్ల నిధులు కేంద్రం నుంచి తెచ్చుకుంటున్న రాష్ట్ర సర్కారు మోడీ ఫొటో ఎందుకు పెట్టదో చెప్పాల్సిన అవసరం ఉంది.
‌‌‌‌- కూరపాటి విజయ్ కుమార్,
జిల్లా ప్రధాన కార్యదర్శి, 
బీజేపీ, మేడ్చల్ రూరల్