- కేరళ నమూనాలో రాష్ట్రంలో ‘టీజీఐఎల్పీ’ షురూ
- తొలి విడతలో 6 వేలు, రెండో విడతలో 8 వేల కుటుంబాలకు లబ్ధి
- ఆధార్, రేషన్, పింఛన్లతో సహా 10 రకాల ఉచిత సేవలు
- ముందుగా 6 నెలలు పోషకాహారం లేదా
- రూ. వెయ్యి సాయం.. ఆపై ఉచితంగా జీవనోపాధి
- ఐదంచెల్లో లబ్ధిదారుల ఎంపిక
- పర్యవేక్షణకు ప్రతీ 30 మందికి ఓ ‘కోచ్’
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న అత్యంత నిరుపేద కుటుంబాల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేరళ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన పేదరిక నిర్మూలన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో ‘తెలంగాణ సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమం’(టీజీఐఎల్పీ) ప్రారంభించింది.
గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సమాజంలో ఎలాంటి ఆసరా లేని అత్యంత నిరుపేదలను గుర్తించి, వారి అవసరాలకు అనుగుణంగా జీవనోపాధి కల్పించేలా పక్కా కార్యాచరణతో ముందుకెళ్తున్నారు.
రెండు విడతల్లో 14 వేల కుటుంబాలకు లబ్ధి
రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విడతల వారీగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. తొలి విడత పైలట్ ప్రాజెక్ట్ గా 6 జిల్లాల్లోని లింగాపూర్, కన్నాయిగూడెం, తాడ్వాయి, అమ్రాబాద్, పదర, కొడంగల్, నర్వ మండలాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అత్యంత పేదరికంలో ఉన్న 6 వేల కుటుంబాలను ప్రాథమికంగా గుర్తించారు.
రెండో విడతలో మరో 8 మండలాల్లో సర్వే చేపట్టి 8 వేల కుటుంబాలను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం, పినపాక, గుండాల, మహబూబాబాద్ జిల్లాలోని గంగారం, జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు, ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, తిర్యాణి మండలాలను చేర్చారు.
6 నెలల సాయం.. ఆపై ఉచితంగా ఉపాధి
ఎంపిక చేసిన అత్యంత నిరుపేద కుటుంబాలకు స్వయం సమృద్ధి సాధించేంత వరకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలువనుంది. మండల సమాఖ్యల ఆధ్వర్యంలో బాధితులకు తక్షణమే ఆధార్, ఆహార భద్రత(రేషన్) కార్డులు, ఉపాధి హామీ జాబ్ కార్డులతో పాటు పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తారు. కుటుంబ పోషణ కోసం తొలి ఆరునెలల పాటు ఉచిత పోషకాహార(న్యూట్రిషన్) కిట్ లేదంటే నెలకు రూ. వెయ్యి చొప్పున ఆర్థికసాయం అందిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఆసక్తి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చిరువ్యాపారాల కోసం షాపులు, గేదెలు, మేకలు, గొర్రెల పెంపకం లేదంటే వ్యవసాయ పరికరాలను ఉచితంగా అందజేస్తారు.
ప్రతీ 30 మందికి ఒక ‘కోచ్’
లబ్ధిదారులకు నిరంతరం మార్గదర్శనం చేసేందుకు ప్రతీ 30 మందికి ఒక 'కోచ్'ను నియమిస్తారు. వీరు లబ్ధిదారులు ఆర్థికంగా స్థిరపడేంత వరకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ కోచ్‌ల పనితీరును ప్రతి నెలా మండల సమాఖ్యలు సమీక్షిస్తాయి.
కాగా, లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రజల భాగస్వామ్య పద్ధతిలో ఐదంచెల సర్వే నిర్వహించారు. గ్రామంలోని స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులు అన్ని వీధుల్లో పర్యటించి, పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ చిత్రాన్ని(మ్యాప్) రూపొందించారు. ఇళ్ల స్వరూపం, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ప్రాథమిక జాబితా తయారు చేశారు.
గ్రామ సమాఖ్య తీర్మానం
ఎంపిక చేసిన ఇళ్లకు నేరుగా వెళ్లి వివరాలు సేకరించి, మహిళా సంఘం సమావేశంలో చర్చించి తీర్మానం చేస్తారు. గ్రామ సమాఖ్య జాబితాను, వలస వెళ్లిన వారి వివరాలను మండల సమాఖ్య ప్రతినిధులు పునఃపరిశీలిస్తారు. ఈ జాబితాను ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి పరిశీలించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికి పంపిస్తారు.
కలెక్టర్ పూర్తి స్థాయిలో పరిశీలించి ఆమోదించాకే లబ్ధిదారులను అధికారికంగా ప్రకటిస్తారు. ఎస్సీ, ఎస్టీలు.. ముఖ్యంగా ఆదిమ తెగలైన కొలాం, తోటి, చెంచు, జోగిని కుటుంబాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. పరిస్థితులను బట్టి బీసీ, ఓసీల్లోని అత్యంత పేదలనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. సొంత ఇల్లు, స్థలం లేనివారు, మట్టి గోడలతో ఒకే గది ఇంట్లో ఉండేవారు, స్థిర ఆదాయం లేని రోజువారీ కూలీలు, భూమి లేనివారు.
నిరుపేద ఒంటరి మహిళలు, వితంతువులు, వదిలేయబడినవారు, ఆసరా లేని వృద్ధులు, పారిశుద్ధ్య కార్మికులు, చెత్త సేకరించేవారు, ట్రాన్స్‌జెండర్లు, టీబీ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, బాలకార్మికులు ఉన్న కుటుంబాలను ఎంపిక చేశారు. కాగా, సర్వే సమయంలో అందుబాటులో లేనివారు, అర్హత ఉండి జాబితాలో పేరు రాని వారు లేదా అనర్హుల ఎంపికపై అభ్యంతరాలు ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. సంబంధిత గ్రామ, మండల సమాఖ్యలకు ఫిర్యాదు చేయవచ్చని చెబుతున్నారు. మండల సమాఖ్యలు వాటిని పరిశీలించి అర్హులకు తగిన న్యాయం చేస్తాయని స్పష్టం చేశారు.
