
మునుగోడు, వెలుగు : మునుగోడులో జరిగేది ముగ్గురు దొరలు... 2 లక్షల ఓటర్ల మధ్య యుద్ధమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులోని పార్టీ ఆఫీస్‌లో ఆదివారం నిర్వహించిన కాన్షీరాం వర్ధంతి కార్యక్రమానికి హాజరైన నివాళులర్పించారు. తర్వాత మాట్లాడుతూ బహుజనుల కోసం మునుగోడులో జరుగుతున్న యుద్ధంలో పేదలే గెలవాలన్నారు. దేశ సంపదను అంబానీ, ఆదానీలకు దోచిపెడుతున్న బీజేపీ, రాష్ట్రాన్ని దోచుకుంది చాలక బీఆర్‌ఎస్‌తో దేశాన్ని దోచుకోవాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌ను ఓడించాలన్నారు.
ఈ రెండూ రాజ్యాంగ వ్యతిరేక పార్టీలని ఆరోపించారు. మునుగోడులో గెలిచి నీలి జెండా ఎగురవేయడమే కాన్షీరాంకు మనం ఇచ్చే నివాళి అని అన్నారు. ఇప్పటివరకు జరిగిన స్వాతంత్ర్య, రైతాంగ, తెలంగాణ తొలి, మలి దశ పోరాటాల వల్ల బహుజనులకు ఒరిగిందేమీ లేదన్నారు. మునుగోడులో ఇప్పుడు జరుగుతున్న పోరాటం కారణంగా బహుజనులకు రాజ్యాధికారం వస్తుందన్నారు. కార్యక్రమంలో ఆందోజు శంకరాచారి, పూదరి సైదులు, జగన్నాథగౌడ్, ప్రమీల, మండల కన్వీనర్ గణేశ్ పాల్గొన్నారు.