మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు సంతోష్ నాయర్ (65) కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం (ఏప్రిల్ 5, 2026) తెల్లవారుజామున పతనంతిట్ట జిల్లా ఎనత్తు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆయన భార్య శుభశ్రీ గాయపడగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో సంతోష్ నాయర్ స్టీరింగ్‌కు ఢీకొనడంతో ఛాతికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సమాచారం. ఆయన భార్యకు రిబ్ ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు.
శుభశ్రీ వృత్తిరీత్యా టీచర్ కాగా, వీరికి రాజశ్రీ ఎస్. నాయర్ అనే కుమార్తె ఉంది. తన విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన సంతోష్ నాయర్ ఆకస్మిక మృతి మలయాళ సినీ పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది.
సంతోష్ నాయర్ సినీ ప్రస్థానం:
సంతోష్ కేశవన్ నాయర్ 1960 నవంబర్ 12న తిరువనంతపురంలో జన్మించాడు. ఆయన తండ్రి సిఎన్ కేశవన్ నాయర్ రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కాగా, తల్లి రాజలక్ష్మి అమ్మ టీచర్‌గా పనిచేశారు. చదువు పూర్తిచేసుకున్న తర్వాత నటనపై ఆసక్తితో సినీ ఎంట్రీ ఇచ్చారు. సంతోష్ నాయర్ 1982లో విడుదలైన ఇతు జ్ఞాంగళుడే కథ (Ithu Njangalude Katha) అనే చిత్రంతో రంగప్రవేశం చేశారు. తన కెరీర్‌లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. హీరోగా, విలన్‌గా, సహాయ పాత్రల్లో విభిన్న పాత్రలు పోషించారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ మోహినియాట్టం ప్రస్తుతం థియేటర్లలో నడుస్తుంది. ఇదే ఆయన చివరి చిత్రం గా నిలిచింది. “భరతనాట్యం 2: మోహినియాట్టం” అనే చిత్రం మే 8 నుంచి Netflixలో స్ట్రీమింగ్‌కు రానుంది.
