
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెబుతూ సోమవారం (మే 12) సంచలన ప్రకటన చేశాడు. అద్భుతమైన ఫిట్ నెస్ ఉన్న 36 ఏళ్ళ కోహ్లీకి మరో మూడు నుంచి నాలుగేళ్లు ఈజీగా టెస్ట్ క్రికెట్ ఆడతారని భావించారు. కోహ్లీ మాత్రం అందరికీ ఊహించని షాకిస్తూ త్వరగానే టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్.. ఇకపై వన్డేల్లో మాత్రమే కనిపించనున్నాడు. అసలు కోహ్లీ ఇంత త్వరగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
1) చివరి నాలుగేళ్లుగా ఘోరమైన ఫామ్:
టెస్ట్ కెరీర్ లో విరాట్ కోహ్లీ గత నాలుగేళ్లుగా స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు. ముఖ్యంగా స్వదేశంలో స్పిన్ ధాటికి కుదేలవుతున్నాడు. ఇక విదేశాల్లో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ వద్ద పడిన బంతులకు ప్రతిసారి దొరికిపోతున్నాడు. చివరి నాలుగేళ్లలో కోహ్లీ
39 టెస్టుల్లో 30.72 సగటుతో 2,028 పరుగులు మాత్రమే చేశాడు. 69 ఇన్నింగ్స్‌లలో కేవలం మూడు సెంచరీలు.. తొమ్మిది అర్ధ సెంచరీలు మాత్రమే ఉన్నాయి.పేలవ ఫామ్ తో తన టెస్ట్ యావరేజ్ 54 నుంచి 47 కి పడిపోయింది. ఫామ్ లేని కారణంగా కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
2) కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడానికే:
టీంఇండియాలో కాంపిటీషన్ చాలా ఎక్కువ. ప్రతిభ ఉన్నప్పటికీ భారత జట్టులో ఛాన్స్ కోసం చాలా మంది ఆటగాళ్లు ఇప్పటికీ బెంచ్ కు పరిమితమవుతున్నారు. కోహ్లీ రిటైర్మెంట్ అతని స్థానంలో ఒక యువ ఆటగాడిని భవిష్యత్ కోసం తయారు చేసుకోవాలి. రజత్ పటిదార్, దేవ్ దత్ పడికల్, సర్ఫరాజ్ అహ్మద్, శ్రేయాస్ అయ్యర్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ టీమిండియా గెలిచిన తర్వాత కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడానికే తప్పుకుంటున్నాని ప్రకటించిన కోహ్లీ.. ఈ సారి కూడా ఆ కారణంతోనే తన రిటైర్మెంట్ తెలిపి ఉండవచ్చు.
3) టార్గెట్ 2027 వన్డే వరల్డ్ కప్:
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి భారత క్రికెట్ జట్టును బాగా కృంగదీసింది. అప్పటివరకు అద్భుతంగా ఆడి.. వరుసగా 10 మ్యాచ్ లు గెలిచిన మన జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా ధాటికి ఓడిపోయింది. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా చేసుకున్నాడు కోహ్లీ. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా 2027 వన్డే వరల్డ్ కప్ గెలవడమే తమ లక్ష్యమని చెప్పాడు. టెస్ట్ క్రికెట్ పేలవ ఫామ్.. అతని వన్డే ఫార్మాట్ లో ప్రభావం చూపించే అవకాశం ఉంది. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి తన దృష్టంతా వన్డే క్రికెట్ పైనే పెట్టాలనే ఆలోచనలో విరాట్ ఉన్నట్టు తెలుస్తోంది.