
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అకడమిక్ ఇయర్ ను గాడిలో పెట్టేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు మొదలుపెట్టింది. ‘గాడి తప్పిన సదువులు’ పేరుతో ఈ నెల12న ‘వెలుగు’లో కథనం పబ్లిష్ అయింది. ఈ నేపథ్యంలో శనివారం ఆరు యూనివర్సిటీల వైస్ చాన్స్ లర్లతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ సమావేశమయ్యారు. అకడమిక్ అంశాలతో పాటు, వివిధ కోర్సుల్లో అడ్మిషన్లపై వీరు చర్చించారు. ఈ నెల 30 నుంచి పీజీ ఫస్టియర్ క్లాసులు ప్రారంభించాలని వీసీలకు ప్రొఫెసర్ లింబాద్రి సూచించారు. దోస్త్ షెడ్యూల్ ప్రకారం డిగ్రీ ఫస్టియర్ క్లాసులు ఈ నెల10 నుంచి ప్రారంభమైనా, ఇంకా చాలా కాలేజీల్లో క్లాసులు స్టార్ట్ కాలేదని, వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక బీఈడీ ప్రవేశాల కోసం ఈ నెల17న, బీపీఈడీ, డీపీఈడీ ప్రవేశాల కోసం ఈ నెల18న నోటిఫికేషన్లు రానున్నాయి.
కరికులమ్ పై వీసీలతో కమిటీ
డిగ్రీ కోర్సులకు సంబంధించిన కరికులమ్, క్రెడిట్స్, గ్రేడింగ్ తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ఓయూ వీసీ డి.రవీందర్, శాతావాహన వర్సిటీ వీసీ మల్లేశ్, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డితో త్రిసభ్య కమిటీని నియమించారు. ఆయా అంశాలపై ముగ్గురు వీసీలు స్టడీ చేసి, ఉపాధి అవకాశాలు ఇచ్చే ఎమర్జింగ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కమిటీ రిపోర్టు ఇవ్వాల్సి ఉంది.
డ్రగ్స్, సైబర్ నేరాలపై కోర్సులు
సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ సమస్యలను నివారించేందుకు యూనివర్సిటీ స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఓ కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కమిటీలో లీగల్ సెల్ అధికారులు, పోలీస్ అధికారులతో పాటు యూనివర్సిటీ అధికారులు సభ్యులుగా ఉండాలని సూచించారు. యూజీసీ గైడ్ లైన్స్ కు అనుగుణంగా సైబర్ నేరాలు, డ్రగ్స్ నిరోధానికి రెండు క్రెడిట్ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్టు కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి తెలిపారు.
17న ఎడ్ సెట్,18న పీఈసెట్ అడ్మిషన్ నోటిఫికేషన్లు
బీఈడీ కోర్సులో అడ్మిషన్లకు ఈ నెల17న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, సెక్రటరీ శ్రీనివాస్ రావు, అడ్మిషన్ల కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. ఈ నెల18 నుంచి 26 వరకూ రిజిస్ర్టేషన్లతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, 26 నుంచి 28 వరకూ స్పెషల్ కేటగిరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. ఈ నెల 28 నుంచి 30 వరకూ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, నవంబర్ 4న ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ఉంటుందని వెల్లడించారు. నవంబర్11 వరకూ కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. ఇక బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల18న పీఈసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 19 నుంచి 26 వరకూ ఆన్ లైన్ రిజిస్ర్టేషన్లతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 26, 27 తేదీల్లో దివ్యాంగ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఈ నెల 29, 30న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, నవంబర్ 2న సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. వీరు కూడా నవంబర్ 11 వరకూ కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. క్లాసులు నవంబర్14 నుంచి మొదలవుతాయి.