హస్తినలో విచారణ.. హైదరాబాద్​లో పోస్టర్లు

హస్తినలో విచారణ.. హైదరాబాద్​లో పోస్టర్లు

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి. బై బై మోడీ హ్యాష్ ట్యాగ్ తో ఈ పోస్టర్లు ప్రింట్ చేశారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ రైడ్​లతో వేధింపులకు గురి చేసినా కవిత రంగులు మార్చే నేత కాదంటూ ఆ పోస్టర్లలో ముద్రించారు. గతంలో దర్యాప్తు సంస్థల దాడులతో రంగులు మార్చిన నేతల ఫొటోలు ప్రింట్ చేశారు. మహారాష్ట్రలో నారాయణ రాణే, ఆంధ్రప్రదేశ్ లో సుజనా చౌదరి, వెస్ట్ బెంగాల్ లో సువేందు అధికారి, అసోంలో హిమంత బిశ్వ శర్మ, మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు రైడ్ లు చేయడంతో వారి రంగు కాషాయంలోకి మారిందని, తెలంగాణకు చెందిన కవితపై ఎంతటి వేధింపులకు పాల్పడుతున్నా, ఆమె మాత్రం వారిలా రంగులు మార్చలేదని పేర్కొన్నారు. 

ఎమ్మెల్సీ కవితను విచారణ పేరుతో కేంద్రం వేధింపులకు పాల్పడుతోందని, గతంలోనూ ఇలాగే వేధించిన నేతలు బీజేపీలో చేరడంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలకు తెలియజెప్పేలా  పోస్టర్లు వేశారు. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని, కవితను వేధిస్తున్న మోడీ ప్రభుత్వానికి బై బై చెప్పే టైం వచ్చిందని పేర్కొన్నారు. ఈ పోస్టర్లు ఎవరు వేశారనే వివరాలు మాత్రం అందులో పేర్కొనలేదు. గతంలోనూ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్ కు వచ్చినప్పుడు బీఆర్ఎస్  నేతలు ఇలాంటి ఆకాశరామన్న  పోస్టర్లు వేశారు.