కరెంట్ బిల్లుల బకాయిలు  రూ.4,200 కోట్లు

కరెంట్ బిల్లుల బకాయిలు  రూ.4,200 కోట్లు

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో భారీగా పేరుకుపోయిన బిల్లులు 

ఎన్నో ఏండ్లుగా పెండింగ్,  కట్టలేమంటున్న పాలక వర్గాలు

రూ.10 వేల కోట్ల  అప్పుల్లో డిస్కంలు

హైదరాబాద్, వెలుగురాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో భారీగా కరెంట్ బిల్లులు పేరుకుపోయాయి. ఇవి వసూలు కాకపోవటంతో రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో మాఫీ చేస్తామని ప్రకటించనుంది. ఈ నిధులను డిస్కంలకు ప్రభుత్వమే చెల్లించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

రూ.4,200 కోట్లు బకాయిలు

రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీలు 12,751 ఉండగా వీటిలో కరెంట్ బిల్లుల బకాయిలు రూ.3,405. 23 కోట్లు ఉన్నట్లు పంచాయతీ రాజ్ అధికారులు తేల్చారు. 141 మున్సిపాలిటీల్లో రూ.800 కోట్ల కరెంట్ బకాయిలు ఉన్నట్లు మున్సిపల్ శాఖ అధికారులు తేల్చారు. ఇవి ఎంతో కాలంగా వసూలు కాకుండా ఉన్నాయి. ఈ ఏడాది చివరలో , లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో జీహెచ్ ఎంసీ, వరంగల్ , ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మాఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయం లేని గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్నాయి. దీంతో పాత బకాయిలు కట్టలేమని సర్పంచ్ లు స్పష్టం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ పీ డీ సీఎల్ , సీపీడీసీఎల్ లు రూ.10 వేల కోట్ల ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాయి. పాత బకాయిలు వసూలు అయితే డిస్కంలకు కొంత అండగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. అయితే ఇవి వసూలయ్యే సూచనలు కనిపించకపోవటంతో ప్రభుత్వం మాఫీ చేసే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల సీఎస్ సమీక్ష

రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతినెల తప్పనిసరిగా కరెంట్ బిల్లులు చెల్లించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగ్ కరెంట్ బిల్లులపై సీఎస్ ఇటీవల బీఆర్కే భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కరెంట్ బిల్లులపై వారంలోగా రిపోర్టు అందజేయాలని ఆదేశించారు. విద్యుత్ బకాయిలపై త్వరలోనే సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

బకాయిలపై పంచాయతీరాజ్ శాఖ ఫోకస్

గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లుల బకాయిలపై పంచాయతీ రాజ్ శాఖ దృష్టి సారించింది. గ్రామాల వారీగా బకాయిలను, బిల్లుల చెల్లింపు వంటి వివరాలను ఈ పంచాయతీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసే పక్రియ ఇటీవలే ప్రారంభించింది. 19 జిల్లాలు ఎన్ పీ డీసీఎల్ పరిధిలో ఉండగా, 14 జిల్లాలు సీపీడీసీఎల్ పరిధిలో ఉన్నాయి. సిద్దిపేట, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో ని కొన్ని ప్రాంతాలు డిస్కంతో పాటు సెస్ పరిధిలో కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.  ఈ పంచాయతీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన తరువాత జిల్లా , మండలం, గ్రామం పేరు క్లిక్ చేయగానే విద్యుత్ బకాయిల సమగ్ర సమాచారం తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

బిల్లులపై అనుమానాలు.. కమిటీ ఏర్పాటు

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు భారీగా వస్తున్నాయి. మిషన్ భగీరథ వచ్చిన తరువాత మోటార్ల సంఖ్య తగ్గింది. అయితే స్ట్రీట్ లైట్లు కు కొంత కాలం క్రితం వరకు మీటర్లు లేవు. గత రెండేళ్ల నుంచి మీటర్లు ఫిట్ చేస్తున్నారు. అయితే చిన్న పంచాయతీలకు కూడా లక్షల్లో బిల్లులు వస్తుండటంతో సర్పంచ్ లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయని పంచాయతీ రాజ్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సర్పంచ్ ల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం జిల్లా స్ధాయిలో కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, స్ధానిక సంస్ధల అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్ గా, జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో), విద్యుత్ శాఖఎస్ ఈ ని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.

కరెంట్ బిల్లులు రద్దు చేయాలని కోరాం..

మా గ్రామంలో రూ.30 లక్షల బకాయిలు ఉన్నాయి. బిల్లులు కట్టమని అధికారులు అడుగుతుంటే కొంత మేర కట్టాం. పాత బకాయిలు కట్టాలంటే భారంగా ఉంది. లక్షల బిల్లులు కడితే గ్రామ అభివృద్ధి ఎలా చేపట్టాలి. బిల్లులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

– ధనలక్ష్మీ, సర్పంచ్ , తాటికోల్ గ్రామం, దేవరకొండ మండలం, నల్గొండ జిల్లా

ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకుంటోంది..

మా గ్రామంలో పాత బకాయిలు 7 లక్షలు ఉన్నాయి. మేం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి నెల బిల్లు కడుతున్నం. కేంద్రం ఇచ్చిన నిధుల నుంచి కరెంట్ బిల్లులు కట్ చేస్తున్నారు. బిల్లులు కడితేనే ఫండ్స్ ఇస్తామని బెదిరిస్తున్నరు.

– ప్రణీల్ చందర్ , సర్పంచ్ ,  నుసురుల్లబాద్ గ్రామం,  మహబూబ్ నగర్ జిల్లా.