- రోజుకు సగటున 16,500 మెగావాట్లకు పైగా వినియోగం
- మార్చిలో 18 వేల మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా
- గృహ, వ్యవసాయ వినియోగం పెరగడమే కారణం
- ఈసారి 70 లక్షల ఎకరాల్లో సాగవుతున్న పంటలు
- నిరుటి కంటే 9 శాతం అధికం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పవర్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. ఎండలు ఇంకా ముదరకముందే ఫిబ్రవరిలోనే కరెంట్ మీటర్లు గిర్ర గిర్రా తిరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 16,500 మెగావాట్ల డిమాండ్ ఉండగా, మార్చిలోనే ఇది 18 వేల మెగావాట్లకు చేరుకోవచ్చని విద్యుత్ శాఖ ఇంజనీర్లు అంటున్నారు. డొమెస్టిక్, కమర్షియల్ అవసరాలతో పాటు అగ్రికల్చర్ వినియోగం పెరగడం ఇందుకు కారణం. ఈ సారి యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.
గత యాసంగితో పోలిస్తే ఇది 9 శాతం ఎక్కువ. మరీ ముఖ్యంగా ఎస్సారెస్పీతో పాటు బ్యారేజీలు, చెరువులు, బోర్లు, బావుల కింద సుమారు 50 లక్షల ఎకరాల్లో వరి వేశారు. ప్రాజెక్టుల కింద ఆరుతడికి మాత్రమే సాగునీరు ఇస్తుండడంతో ఆయకట్టు ప్రాంతాల్లోనూ రైతులు కరెంట్ మోటార్లు వినియోగిస్తున్నారు. దీంతో ఈ యాసంగి సీజన్లో పీక్ డిమాండ్ 19 వేల మెగావాట్లు దాటవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫిబ్రవరిలోనే పెరుగుతున్న పవర్ డిమాండ్
2024లో ఫిబ్రవరి 19న 14,831 మెగావాట్ల కరెంట్ వినియోగించినట్లు రికార్డులు చెబుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో ఇది 16 వేల మెగావాట్లకు చేరగా, ఈ సారి అంతకుమించి రెండు రోజులుగా16,818 మెగావాట్ల మేర వినియోగం జరుగుతున్నది. అంటే రెండేండ్లలోనే సుమారు 2 వేల మెగావాట్ల వినియోగం పెరిగింది. నిరుడు మార్చిలో 17,162 మెగావాట్ల పీక్ రికార్డ్ నమోదు కాగా, ఈ ఏడాది ఈ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉందని విద్యుత్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇండస్ట్రియల్ గ్రోత్, అర్బనైజేషన్, ఎకనామిక్ ఎక్స్పాన్షన్ వల్ల పవర్ డిమాండ్ ఏటేటా పెరుగుతున్నదని చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని అవసరాలకు 301 మిలియన్ యూనిట్ల కరెంట్అవసరం అవుతుండగా, జెన్కో నుంచి 98.24, సింగరేణి నుంచి11.94 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుతున్నది. దీంతో బయటి నుంచి 131.16 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
పెరిగిన గృహ, కమర్షియల్ వినియోగం
చలి తగ్గడంతో కొద్ది రోజులుగా పగటి పూట ఉక్కపోత మొదలైంది. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు ఇండ్లల్లోనూ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే కరెంట్ వినియోగం 10 నుంచి 13 శాతం పెరిగిందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
సాధారణంగా మార్చి నుంచి జూన్ మొదటి వారం వరకు హీట్ వేవ్స్ ఉంటాయి. అప్పుడు పవర్ డిమాండ్ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈలెక్కన మే నెలలో డిమాండ్దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేస్తున్న విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు.
