15 రోజులన్నరు.. రెండు నెలలైనా శ్రీశైలం షురూ కాలే

15 రోజులన్నరు.. రెండు నెలలైనా శ్రీశైలం షురూ కాలే
  •     పవర్ జనరేషన్ షురువయ్యేది ఎప్పుడో?  
  •     శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంపై వీడని మిస్టరీ
  •     ఇప్పటికీ కమిటీల రిపోర్టులు రాలే
  •     ఘటనపై మొదటినుంచీ అంతా గప్ చుప్
  •    సీక్రెట్ గా ఉంచుతున్న విద్యుత్ వర్గాలు  

 హైదరాబాద్‌‌, వెలుగు:  ఆగస్టు 20 అర్ధరాత్రిన శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌‌ ప్లాంట్‌‌లో ప్రమాదం జరిగింది. ప్లాంట్‌‌లో 150 మెగావాట్‌‌ల కెపాసిటీ ఉన్న ఆరు యూనిట్లలో రెండు యూనిట్లు మినహా మిగతావి భారీగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే బాగున్న ఆ రెండు యూనిట్లలో అయినా విద్యుత్ ఉత్పత్తి ఇప్పటి వరకు షురూ కాలేదు. మొదటి ప్రయత్నాల్లో మళ్లీ షార్ట్‌‌ సర్క్యూట్‌‌ కాగా దాన్ని మాక్‌‌ డ్రిల్‌‌ అని చెప్పి కప్పి పుచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.  గత రెండు నెలలుగా నీళ్లు తోడడానికి, క్లీన్‌‌ చేయడానికే ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు యూనిట్లను ఈ నెల15న స్టార్ట్‌‌ చేయాలని భావించారు. కానీ లోడ్‌‌ తీసుకోవడం లేదని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. షట్‌‌ డౌన్‌‌ చేసిన సందర్భంలో ఉన్న మైనర్‌‌ సమస్యలను రెక్టిఫై చేసి పరిష్కరించినట్లు తెలిసింది. మరో వారం రోజుల్లో నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రిపోర్టులకు ఇంకా టైమ్.. 

ప్రమాదం జరిగిన మరునాడే, దీనిపై దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. అదేరోజున జెన్ కో.. సీఎండీ ప్రభాకర్‌‌రావు, టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌ సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్‌‌కో జెఎండీ శ్రీనివాస్‌‌రావు, మరో ముగ్గురు డైరెక్టర్లతో ప్రత్యేక టెక్నికల్‌‌ కమిటీనీ వేసింది. డీజీ గోవింద్‌‌సింగ్‌‌ ఆధ్వర్యంలో సీఐడీ దర్యాప్తు చేసింది. ఈ సంఘటన ప్రమాదమా? ఏదైనా కుట్రకోణమా? అనేది తేల్చేందుకు సీఐడీ టీమ్‌‌ ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కుట్రకోణం లేదని ప్రమాదమనే సీఐడీ నివేదిక రూపొందించినట్లు సమాచారం.  ప్రమాదం ఎలా జరిగిందనేది తేల్చేది మాత్రం ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీనే. అయితే సీఎండీకీ, ఇద్దరు డైరెక్టర్లకు కరోనా రావడంతో నివేదిక రూపొందించడంలో జాప్యం జరిగినట్లు ఇటీవల మంత్రి జగదీష్‌‌రెడ్డి కౌన్సిల్‌‌ సమావేశంలో వెల్లడించారు. గత నెలలో రెండు రోజుల పాటు శ్రీశైలంలో తిష్టవేసి ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ దర్యాప్తు చేపట్టింది. టెక్నికల్ కమిటీ శ్రీశైలం వెళ్లి కూడా ఇప్పటికే నెల కావస్తోంది. అయినా రిపోర్టు అందించలేదు. అయితే రెండు రిపోర్టులు వేర్వేరుగా వస్తే సమస్య అని రెండింటినీ పరిశీలించి నివేదిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రిపోర్టులు ఇవ్వడానికి ఇంకా టైమ్ పడుతుందని సమాచారం. మొత్తంగా శ్రీశైలం ప్రమాదాన్ని టెక్నికల్‌‌ ప్రాబ్లమ్‌‌గా తేల్చే పనిలో ఉన్నట్లు తెలిసింది.

కప్పిపుచ్చేందుకు ప్రయత్నం..

శ్రీశైలం పవర్‌‌ప్లాంట్ ప్రమాదంపై విద్యుత్‌‌ వర్గాలు మొదటినుంచీ గప్‌‌చుప్‌‌గా వ్యవహరిస్తున్నాయి. ప్రమాదం ఘటన బయటపడకుండా ప్రయత్నం చేసినట్లు తెలిసింది. వీడియోలు బయటికి రాకపోతే అసలు విషయాన్నే బయటికి రాకుండా చూసేవాళ్లన్న అనుమానాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే.. రెస్క్యూ బృందాలను పంపకుండా మంత్రి, సీఎండీ స్వయంగా వెళ్లడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. వీరిద్దరూ తెల్లవారుజామునే ప్లాంటుకు చేరుకోగా, రెస్క్యూ బృందాలు మాత్రం మరునాడు మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నాయి. ఆ తర్వాత ప్రైవేట్ సిబ్బంది ఉన్న టైంలో షార్ట్ సర్క్యూట్ జరిగితే దాన్ని మాక్ డ్రిల్ అని కప్పిపుచ్చారన్న విమర్శలు వచ్చాయి. సొంత సిబ్బంది ఉన్నప్పడు చేయాల్సిన మాక్‌‌ డ్రిల్‌‌ ప్రైవేటు సిబ్బంది ఉన్నప్పుడు ఎలా చేస్తారన్న అనుమానాలు తలెత్తాయి. మొత్తంగా రెండు నెలలైనా ఈ ఘటనపై మిస్టరీ అలాగే ఉండిపోయింది.