హైదరాబాద్, వెలుగు: విద్యుత్‌ఉద్యోగులు, ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం చైర్మన్ సాయిబాబా కోరారు. విద్యుత్ సౌధ ముందు నిర్వహించబోయే ఈ మహాధర్నాకు చెందిన వాల్‌పోస్టర్‌ను పవర్ జేఏసీ నేతలు హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ.. జెన్కో, ట్రాన్స్‌కో, సదరన్, నార్తర్న్ డిస్కమ్‌ల పరిధిలోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూన్ 18న యాజమాన్యానికి వినతి పత్రం సమర్పించామని గుర్తుచేశారు. ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన రాలేదని తెలిపారు.
పలు దఫాలుగా నోటీసులిచ్చినప్పటికీ యాజమాన్యం చర్చలు జరపకపోవడం వల్లే మహా ధర్నా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని కోల్ హ్యాండ్లింగ్, ఆష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో ఆపరేషన్ అండ్మెయింటనెన్స్ కార్యకలాపాలను ఔట్‌సోర్సింగ్ చేయడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై ఉద్యోగులు 45 రోజులకు పైగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ..యాజమాన్యం చర్చలు జరపకపోవడం బాధాకరమన్నారు. 19న ఉదయం 11.00 గంటలకు విద్యుత్ సౌధలో నిర్వహించనున్న మహా ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఆర్టిజన్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు, వైస్ చైర్మన్ వజీర్, తాజుద్దీన్ బాబా, భూపాల్ రెడ్డి, సదానందం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
