కరెంటు సరఫరా అస్తవ్యస్తం.. 63 సబ్ స్టేషన్లలోకి వరద

కరెంటు సరఫరా అస్తవ్యస్తం.. 63 సబ్ స్టేషన్లలోకి వరద

దెబ్బతిన్న ట్రాన్స్ ఫార్మర్లు: 686

నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు: 312

హైదరాబాద్‌, వెలుగు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు కరెంట్ వ్యవస్థ మొత్తం ఆగమైంది. సబ్ స్టేషన్లలోకి వరద నీరు చేరింది. వరదలు పెద్ద ఎత్తున రావడంతో ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63 సబ్ స్టేషన్లలోకి వరద వచ్చింది. గ్రేటర్ పరిధిలోని 15 సబ్ స్టేషన్లలోకి పెద్ద ఎత్తున వరద రావడంతో, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక 686 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటిలో కొన్ని నేలకూలాయి. మూసీ పరీవాహక ప్రాంతంలోని దాదాపు 200లకు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు వరదల్లో కొట్టుకుపోయినట్లు అధికారులు అంచనా వేశారు. 671 ట్రాన్స్ పార్మర్లను సరిచేసినట్లు చెప్పారు. అయితే వెయ్యికి పైగా ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు 312 కరెంట్ స్తంభాలు విరిగిపోయాయి. వీటిలో 249 పోల్స్ ను సరిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ…

భారీ వానలు, వరదలకు కరెంట్ సప్లైకి అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు హైదరాబాద్‌లోని 100కు పైగా ప్రాంతాల్లో కరెంట్ ను నిలిపివేశారు. జలమయమైన ప్రాంతాలకు సిబ్బంది వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రిపేర్లు చేయలేకపోయారు. మరోవైపు అపార్ట్ మెంట్లలోని సెల్లార్లలోకి వరద చేరడంతో కరెంట్ బంజేశారు. ప్రమాదాలను నివారించేందుకు ముందు జాగ్రత్తగా సప్లైని నిలిపివేశారు. మంగళవారం రాత్రి నుంచి సిటీ సహా శివార్లలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ చీకట్లోనే గడపాల్సి వచ్చింది.

విద్యుత్‌ డిమాండ్‌ ఢమాల్

వానలతో విద్యుత్ డిమాండ్ బాగా పడిపోయింది. వర్షాలతో ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో విద్యుత్ డిమాండ్ మంగళవారం అర్ధరాత్రి నాటికి 2,700 మెగావాట్లకు పడిపోయింది. రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువకు డిమాండ్‌ పడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.