- గుజరాత్పాంచ్.. 4 వికెట్ల తేడాతో బెంగళూరుఓటమి
- రాణించిన గిల్, బట్లర్, అర్షద్ ఖాన్
- దేవదత్, భువనేశ్వర్ శ్రమ వృథా
అహ్మదాబాద్: ఐపీఎల్–19లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయాలకు గుజరాత్ టైటాన్స్ చెక్ పెట్టింది. ఛేజింగ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (18 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43), జోస్ బట్లర్ (19 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39) ధనాధన్ షాట్లతో చెలరేగడంతో.. గురువారం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో గుజరాత్ 4 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలిచింది.
టాస్ ఓడిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 రన్స్‌కే ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ (24 బాల్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40) టాప్ స్కోరర్. కోహ్లీ (28)తో సహా మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత గుజరాత్ 15.5 ఓవర్లలో 158/6 స్కోరు చేసి నెగ్గింది. హోల్డర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
- బ్యాటర్లు ఫెయిల్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు బ్యాటర్లు వేగంగా పరుగులు చేసే క్రమంలో జీటీ పేసర్లకు వికెట్లు ఇచ్చుకున్నారు. మూడో ఓవర్‌లోనే సిరాజ్ (1/38).. జాకబ్ బెథెల్ (5)ను ఔట్ చేయగా, తర్వాతి ఓవర్‌లో విరాట్ కోహ్లీని రబాడ (1/44) పెవిలియన్‌కు పంపాడు. ఐదు బాల్స్ తేడాలో ఈ ఇద్దరు ఔట్ కావడంతో ఆర్సీబీ 35/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో పడిక్కల్, రజత్ పటీదార్ (19) ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. పవర్‌ప్లేలో 59/2 స్కోరు చేసిన ఆర్సీబీకి 8వ ఓవర్‌లో అర్షద్ ఖాన్ (3/22) షాకిచ్చాడు.
పటీదార్‌ను ఔట్ చేసి మూడో వికెట్‌కు 44 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగించాడు. మరో రెండు బాల్స్ తర్వాత హోల్డర్ (2/29).. జితేష్ శర్మ (1) వికెట్ తీయడంతో స్కోరు 80/4గా మారింది. పదో ఓవర్‌లో రషీద్ ఖాన్ (2/19) దెబ్బకు టిమ్ డేవిడ్ (9) కూడా వెనుదిరగడంతో బెంగళూరు 91/5 తొలి టెన్ ఓవర్స్‌ను ముగించింది. ఓ ఎండ్‌లో పడిక్కల్ నిలకడగా ఆడినా.. 11వ ఓవర్‌లో క్రునాల్ పాండ్యా (4)ను ఔట్ చేసిన అర్షద్ వికెట్ల పతనాన్ని కొనసాగించాడు. దాన్ని హోల్డర్, రషీద్ ముందుకు తీసుకెళ్లారు.
వరుస బాల్స్‌లో పడిక్కల్, రొమారియో షెఫర్డ్ (17)ను ఔట్ చేయడంతో స్కోరు 126/8గా మారింది. చివర్లో వెంకటేశ్ అయ్యర్ (12), భువనేశ్వర్ కుమార్ (15 నాటౌట్) కాసేపు బ్యాట్లు అడ్డేశారు. సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే బౌండ్రీలు బాదారు. కానీ అర్షద్ ఖాన్ వేసిన చివరి ఓవర్‌లో వరుస బాల్స్‌లో వెంకటేశ్, హాజిల్‌వుడ్ (0) ఔట్ కావడంతో ఆర్సీబీ పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది.
- గిల్ మెరుపులు..
ఛేజింగ్‌లో గిల్ మెరుపు ఆరంభాన్నిచ్చినా.. మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. చిన్న ఛేజింగ్‌ను చివరివరకు కొనసాగించారు. 4, 6తో ఖాతా తెరిచిన గిల్ రెండో ఓవర్‌లో 4, 4, 6, 4, 6తో 24 రన్స్ దంచాడు. కానీ రెండో ఎండ్‌లో ఫోర్ కొట్టిన సాయి సుదర్శన్ (6) మూడో ఓవర్‌లో భువీ (3/28)కి వికెట్ ఇచ్చాడు. తొలి వికెట్‌కు 42 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. సరిగ్గా రెండు ఓవర్ల తర్వాత గిల్ కూడా వెనుదిరగడంతో గుజరాత్ 57/2తో నిలిచింది. ఈ దశలో బట్లర్ 4, 6 కొట్టడంతో పవర్‌ప్లేలో జీటీ 69/2 స్కోరు చేసింది.
ఫీల్డింగ్ పెరిగిన తర్వాత కూడా బట్లర్ రెండు సిక్స్‌లు బాదాడు. కానీ 8వ ఓవర్‌లో ఫోర్ కొట్టిన బట్లర్‌ను భువీ మళ్లీ దెబ్బకొట్టాడు. మూడో వికెట్‌కు 35 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. సుందర్ 6, షారూక్ ఖాన్ (8) 4తో ఫస్ట్ టెన్‌లో గుజరాత్ 109/3తో పటిష్ట స్థితికి చేరుకుంది. అయితే 11వ ఓవర్‌లో షెఫర్డ్ (2/30) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. మూడు బాల్స్ తేడాలో షారూక్, సుందర్‌ను ఔట్ చేసి షాకిచ్చాడు. దాంతో స్కోరు 111/5గా మారింది. ఇదే ఓవర్‌లో హోల్డర్ (12) 6, 4 దంచినా త్వరగానే వెనుదిరిగాడు. చివర్లో రాహుల్ తెవాటియా (27 నాటౌట్), రషీద్ ఖాన్ (7 నాటౌట్) నిలకడగా ఆడి మరో 25 బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు.
- సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 155 ఆలౌట్ (దేవదత్ 40, కోహ్లీ 28, అర్షద్ ఖాన్ 3/22,హోల్డర్2/29).
గుజరాత్: 15.5 ఓవర్లలో 158/6 (గిల్ 43, బట్లర్ 39, భువనేశ్వర్ 3/28).
టీ20ల్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నరెండో ఇండియన్ బౌలర్ భువనేశ్వర్(352). చహల్ (391) ముందున్నాడు.

