ఆర్థిక ప్రగతికి పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఆర్థిక ప్రగతికి పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం :  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • గ్రామీణ ప్రాంతాల్లోనూ భారీ పరిశ్రమలు రావాలి 
  • పోలీస్ శాఖలో ఈవీల వినియోగం.. మూలమూలనా సీసీ కెమెరాలు
  • సెక్రటేరియెట్ లో హోం, ఇండస్ట్రీస్, ఐటీ శాఖలతో డిప్యూటీ సీఎం భట్టి ప్రీ బడ్జెట్ భేటీలు
  • 41 జీసీసీలతో దేశంలోనే మొదటి స్థానంలో రాష్ట్రం: శ్రీధర్ బాబు 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి పరుగులు పెట్టాలంటే పెట్టుబడుల సాధనలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) మోడల్ అనివార్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ ప్రపంచంలోనే మేటి నగరంగా వేగంగా ఎదుగుతున్న క్రమంలో దానికి దీటుగా మౌలిక సదుపాయాలు, సంస్కరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

యువతను కేవలం ఉద్యోగులుగానే కాకుండా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. సచివాలయంలో గురువారం హోం, పరిశ్రమలు, ఐటీ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రీబడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్న తరుణంలో శాంతిభద్రతల పరిరక్షణలో ఏ చిన్న పొరపాటుకూ తావు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.

పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలను(ఈవీ) వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. నేర నియంత్రణలో చిన్న కదలికలను సైతం పసిగట్టి నిఘాను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాల మరమ్మతులు, వినియోగాన్ని పెంచాలని సూచించారు. 2047 నాటికి రాష్ట్రం సాధించాల్సిన 'త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ' లక్ష్యంలో పోలీస్ శాఖ పాత్ర అత్యంత కీలకమని విశ్లేషించారు. 

రూరల్ అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్..  

క్యూర్, ప్యూర్ మోడల్స్ తో పాటుగా 'రేర్'  విధానానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. అభివృద్ధి కేవలం నగరాలకే పరిమితం కాకుండా రాష్ట్ర సమగ్ర ప్రగతికి 'రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ'(రేర్​)పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ వ్యవసాయ ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖకు దిశానిర్దేశం చేశారు.

ఇందుకోసం మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ (ఎంఎస్ఎంఈ) రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డేటా సెంటర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకాన్ని భారీ ఎత్తున చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబుకు భట్టి సూచించారు. ఐటీ, పారిశ్రామిక రంగాల పురోగతిలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.

ప్రస్తుతం 41 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ)లతో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఇదే వేగాన్ని కొనసాగించేలా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి ప్రోత్సాహకాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశాల్లో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్, టీజీఐఐసీ ఎండీ శశాంక, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.