విక్రమాదిత్యగా ప్రభాస్.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్

విక్రమాదిత్యగా ప్రభాస్.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. ప్రభాస్ 20వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకు ‘జిల్’ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నది. ఇటీవల పూజా హెగ్డే పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం.. తాజాగా ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది.

అక్టోబ‌ర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ అనే మోష‌న్ పోస్టర్‌ని విడుద‌ల చేయ‌బోతున్న మూవీ యూనిట్.. ప్రభాస్‌కి అడ్వాన్స్ హ్యాపీ బ‌ర్త్ డే విషెస్ చెబుతూ ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను‌ విడుదల చేసింది. ఇటలీలో ఉన్న గ్రీకు క‌ట్టడాల బ్యాక్ డ్రాప్‌లో వింటేజ్ కార్ మీద బ్లూ బ్లేజ‌ర్ వేసుకుని స్టైలిష్‌గా కుర్చున్న ప్రభాస్ లుక్.. అభిమానుల్లో ‘రాధే శ్యామ్’ చిత్రంపై మ‌రింత‌గా అంచ‌నాలు పెంచేలా ఉంది.

వింటేజ్ రొమాంటిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు తోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది.