జ్ఞానేశ్ రాజీనామా చేయాలి.. దళితులు, ముస్లింల ఓట్ల తొలగింపునకు సీఈసీ కుట్ర: ప్రకాశ్ రాజ్

జ్ఞానేశ్ రాజీనామా చేయాలి..  దళితులు, ముస్లింల ఓట్ల తొలగింపునకు సీఈసీ కుట్ర: ప్రకాశ్ రాజ్
  • 2023 నుంచి మోదీ, షా అజెండా అమలు: ప్రకాశ్ రాజ్
  • ఈసీ నిర్ణయాలపై సుప్రీంకోర్టు విచారణ చేయాలని విజ్ఞప్తి
  • మేం దిమాగీ నక్సల్స్ కాదు.. వాళ్లే అసలైన దేశద్రోహులు
  • ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందన్న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్
  •     ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది:  జస్టిస్ చంద్రకుమార్


హైదరాబాద్, వెలుగు: దేశంలో గణేశ్‌ నిమజ్జనం పూర్తయిందని, ఇక ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ విసర్జనం జరగాల్సిందేనని  సినీ నటుడు, సామాజిక విశ్లేషకుడు ప్రకాశ్‌ రాజ్ పేర్కొన్నారు. హంతకుడు మర్డర్ చేసేటప్పుడు దొరకడని, సాక్ష్యాలు తారుమారు చేసేటప్పుడు దొరుకుతాడని,  ఇప్పుడు జ్ఞానేశ్‌ కుమార్ కూడా అలాగే దొరికిపోయాడన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.  ‘సర్’​ ప్రక్రియను రద్దు చేయాలని, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్​ చేశారు.

శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో  ‘సర్, ​ప్రస్తుత రాజకీయ పరిణామాల’పై హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జస్టిస్​ చంద్రకుమార్​,  తెలంగాణ రాష్ట్ర డెమొక్రటిక్​ ఫోరమ్​ కన్వీనర్​ ప్రొఫెసర్‌‌ వినాయక్‌రెడ్డి, డెమొక్రటిక్​ ఆల్​ టీచర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ ప్రొఫెసర్‌‌ వెంకటదాస్​, మూమెంట్​ ఫర్​ పీస్​ అండ్​ జస్టిస్​ ప్రెసిడెంట్​మహమ్మద్​ అబ్దుల్​అజీజ్‌తో కలిసి ప్రకాశ్​రాజ్​ మీడియా ఇంటరాక్షన్​ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఏర్పడిన నాటి నుంచి ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు సహజంగా జరుగుతుంటాయని, కానీ ఇప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్ పేరుతో ‘సర్’​ను హడావుడిగా ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల హక్కులు ప్రమాదంలో పడ్డాయని, 14 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యాకే అసలు కుట్ర బయటపడిందని ఆరోపించారు. గతంలో ఈసీ చేపట్టిన ఇలాంటి అక్రమ సవరణల వల్లే బెంగాల్‌లో ప్రభుత్వమే మారిపోయిందన్నారు.  ప్రతి పౌరుడికి ఓటుహక్కు కల్పించేందుకు అంబేద్కర్, నెహ్రూలాంటి మహనీయులు పోరాడారని, ఇప్పుడు పౌరులు తమకు ఓటు ఉందని నిరూపించుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు.

బీజేపీ ఆఫీసుల నుంచే ఓట్ల తొలగింపు ఆదేశాలు

దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, ట్రాన్స్‌జెండర్ల ఓట్లను కుట్రపూరితంగా తొలగించేందుకు బీజేపీ ఆఫీసుల నుంచే ఓటర్ల జాబితాలు రూపొందిస్తున్నారని ప్రకాశ్‌రాజ్​ ఆరోపించారు.  ఎవరెవరి ఓట్లు తీసేయాలో కూడా అక్కడ నుంచే ఆదేశాలు వస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ‘బిల్లా -రంగా’లతో పోల్చారు. వీరిద్దరే జ్ఞానేశ్ కుమార్ వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారని ఆరోపించారు. సీఈసీ నిర్ణయాలను ప్రశ్నిస్తూ ఎవరూ కోర్టులకు వెళ్లకుండా ముందే చట్టం తెచ్చారని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను, పౌర సమాజాన్ని ‘దిమాగీ నక్సల్స్’ అని విమర్శించడం మోదీ, అమిత్ షాకు అలవాటుగా మారిందని ఫైర్​ అయ్యారు. 

‘‘ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును కాపాడుకోవడానికి పోరాడుతున్న మేం నక్సల్స్ కాదు.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీస్తున్న మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌లే అసలైన దేశద్రోహులు” అని మండిపడ్డారు. ఇద్దరు కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్‌బీర్ సింగ్ సంధు ‘సర్’​ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తంచేసినా.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఒక్కరే మొండిగా ముందుకెళ్తున్నారన్నారు. ట్రాన్స్‌జెండర్లకు సరైన ఇల్లు, కుటుంబం ఉండవని, వారు ఓటు హక్కు కోసం ఏ పేపర్లు చూపించాలని నిలదీశారు. కొత్త ఓటర్ల కోసం వాడే ఫామ్-6 ను.. ఓటు పోయినవారిని మళ్లీ నింపమనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో తనకు 4 ఓట్లు ఉన్నాయని బీజేపీ అబద్ధాలు ప్రచారం చేసిందని,  తమిళనాడు నుంచి బెంగళూరుకు ఓటు షిఫ్ట్ చేసుకుంటే.. ఉన్న ఒకే ఒక్క ఓటు తీసేశారని, ఇప్పుడు నాలుగు ఓట్ల ఎపిక్ నంబర్లు ఎక్కడ? అని ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు విచారణ జరపాలి

2023 నుంచి ఎన్నికల కమిషన్ తీసుకున్న ప్రతి నిర్ణయంపై, చేపట్టిన ప్రతి ప్రక్రియపై సుప్రీంకోర్టు సమగ్ర విచారణ జరిపించాలని ప్రకాశ్‌రాజ్​ డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌పై కేసులు నమోదు చేయాలన్నారు. దేశంలో ఎప్పుడు ఏ ఆఫీసులో ఫైళ్లు కాలిపోతాయో, సాక్ష్యాలు తారుమారవుతాయో తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఒకేసారి ఎన్నికలు తెచ్చి ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేసేందుకు, మనుస్మృతి సిద్ధాంతాలను అమలు చేసేందుకు ఈసీ ద్వారా కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. దేశం ప్రస్తుతం ప్రమాదంలో ఉందని, భావజాల భేదాలు పక్కనబెట్టి అందరూ ఐక్యంగా ‘సర్’​ ప్రక్రియను రద్దు చేసే వరకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ ఏకం కావాలన్నారు. 

గెలిచే అవకాశం లేనప్పుడే అక్రమాలు చేస్తారు: జస్టిస్ చంద్రకుమార్

దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో పడ్డాయని హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. అసలు ఎన్నికలు జరుగుతాయా..?, జరగవా..?, ఎన్నికల్లో అర్హులైనవారికీ ఓటు హక్కు ఉంటుందా.., ఉండదా..? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేనప్పుడు ఇలాంటి ఆక్రమాలకు పాల్పడుతారని విమర్శించారు. ఓటర్లు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారని, కానీ అధికారంలో ఉన్నవారే ఓట్లర్లను ఎన్నుకునే పరిస్థితి వచ్చిందన్నారు.  ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

భగత్‌సింగ్‌లాంటి ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యం నేడు కొందరి అధికారం కోసం బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి రాజ్యాంగ వ్యవస్థలను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న యువతను అణచివేయడానికి మెట్రో సర్వీసులు నిలిపివేసి, పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ఆంక్షలు విధిస్తూ, అధికార పార్టీ అనుబంధ సంస్థల సభలకు మాత్రం అనుమతులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల స్వేచ్ఛను, ఓటు హక్కును రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ శాంతియుత ఉద్యమాలు, సత్యాగ్రహాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.