హైదరాబాద్, వెలుగు: మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయిగాని దేశానికి తగిలిన గాయాలు మానవని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. కులం, మతోన్మాదశక్తులతో దేశానికి ప్రమాదం పొంచి ఉందని అన్నారు. శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రొ.కాశీం, ప్రొ. పద్మజాషా, ప్రొ.భంగ్యా భుక్కా, సీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్ తదితరులతో కలసి ఆయన 'సమూహ' సెక్యూలర్ రైటర్స్ ఫోరమ్ ను ప్రారంభించారు.
ఫోరమ్ లోగోని ఆవిష్కరించిన అనంతరం ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. దేశానికి తగిలిన గాయాల గురించి ప్రజలకు వివరించేందుకు సమూహ అవసరమని తెలిపారు. రచయితలు రాసే దారిలో రక్తం ఉంటుందని, అందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. సమాజానికి ఉపయోగపడే పనులు జరుగుతున్నప్పుడు అందులో తానూ తప్పకుండా భాగం పంచుకుంటానని వెల్లడించారు. 100 రోజులుగా మణిపూర్ లో అల్లర్లు జరుగుతుంటే పార్లమెంట్ సమావేశాలు చర్చలు లేకుండా నామమాత్రంగా నిర్వహించారని ఆరోపించారు.
మణిపూర్ పై ప్రశ్నిస్తే హర్యానా, బెంగాల్ గురించి అనవసర ప్రస్తావన తెస్తున్నారని కేంద్రాన్ని విమర్శించారు. స్టేషన్ మాస్టర్‌లాగా, జోకర్‌లాగా పచ్చ జెండా ఊపి ట్రైన్‌లను ప్రారంభించడం తప్పితే దేశంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు. సమాజంలో ఐక్యత లేదని, అందుకు పొలిటికల్ లీడర్స్ ప్రయత్నం కూడా చేయడంలేదని ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోరమ్‌కు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
రచనలే ప్రజలను ఒక్క తాటిపైకి తెస్తయ్
సినీయర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంచి రచనలే అన్ని మతాలు, కులాల వారిని ఒక్క తాటిపైకి తీసుకొస్తాయని అన్నారు. వివిధ కులస్తులతో ఇంటరాక్షన్ ఉంటేనే భిన్నత్వం ఏమిటో తెలుస్తుందని చెప్పారు. ఎంచుకునే ఆంశం మీద ఫోకస్ పెట్టాలని రచయితలకు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదని పేర్కొన్నారు. ప్రొ.కాశీం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి బీజేపీ శత్రువుగా మారిందని అన్నారు.
వారికి ముస్లింలు, కమ్యూనిస్ట్‌లు, అంబేద్కర్‌వాదులు శత్రువులుగా కనిపిస్తుంటారని తెలిపారు. రాజకీయాలు చేయడానికి బీజేపీ నేతలు ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదని మండిపడ్డారు. ఇష్టంలేని వారిపై దాడులు చేయాలంటే రాజ్యాంగం అడ్డు వస్తుందనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రొ.పద్మజా షా మాట్లాడుతూ.. వేట కుక్కలకు వేట నేర్పినట్లు బీజేపీ నేతలు అమాయకులకు విద్వేషం నేర్పుతున్నారని మండిపడ్డారు.
ఇండియాలో జరుగుతున్న దోపిడీకి మతమే కారణమని చెబుతూ.. పిల్లల మైండ్‌సెట్ మారుస్తున్నారని ప్రొ. భంగ్య భుక్యా ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం 20 మంది సభ్యులతో కార్యనిర్వహక కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో స్కైబాబా, రవీందర్, కాత్యాయిని, శ్రీనివాస్, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.
