ఆసిఫాబాద్, వెలుగు: ప్రాణహిత పుట్టినిల్లు, సంగమస్థానానికి వేదికైన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పుష్కర శోభకు దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. పుష్కరాల టైంలో నదిలో పవిత్ర స్నానం చేస్తే సకల పాపాలూ తొలగి మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తారు. ప్రాణహిత నదికి పుష్కరాలు మరో మూడు నెలల్లో జరుగనున్నాయి. అయితే ప్రాణహిత జన్మస్థలం కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ఇప్పటివరకు సర్కార్ పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. మరోవైపు పుష్కరాల నిర్వహణ బాధ్యతలు చూసే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఆసిఫాబాద్లో కాకుండా మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ప్రాణహిత పుష్కరాల మీద ప్రజా ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
2011లో తొలిసారి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టిలో 2011లో తొలిసారి పుష్కరాలు జరిగాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా పుష్కర ఘాట్ ను రూ. 30 లక్షలతో నిర్మించింది. అప్పుడు అంతగా ప్రచారం లేకపోవడంతోపాటు మొదటిసారి కావడంతో భక్తులు రాక కొంత తక్కువగానే ఉంది. అధికారికంగా నిర్వహించిన పదకొండు రోజుల కార్యక్రమాలకు ఉమ్మడి జిల్లాతో పాటు కరీంనగర్, మహారాష్ట్ర భక్తులు వచ్చి పుణ్య స్నానాలు చేశారు. ఇప్పుడు ప్రజల్లో పుష్కరాలపై అవగాహన పెరగడం, రవాణాపరంగా సౌకర్యాలు మెరుగుపడడంతో ఈసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది.
ప్రాజెక్ట్ తరలింపు.. విభేదాలే కారణమా
సాధారణంగా నది పుట్టినచోటు, నదీ మార్గంలో ప్రాశస్త్యం ఉన్నచోట పుష్కరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రాణహిత పుష్కరాల విషయంలో సర్కార్ తీరు స్థానికంగా విమర్శలకు తావిస్తోంది. ప్రాణహిత సంగమ స్థానం కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద అట్టహాసంగా చేస్తారని ఆశపడ్డ ప్రజలకు నిరాశ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే ప్రదేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ శంకుస్థాపన, కాలువల తవ్వకంతోనే ముగిసింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్ట్ ల రీ డిజైనింగ్ లో భాగంగా ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్ట్ కాళేశ్వరానికి తరలిపోయింది. ఇక్కడ ప్రత్యామ్నాయంగా ప్రాజెక్ట్ కడతారని రైతులు, ప్రజలు ఆశించినా ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. ఈ సమయంలో పుష్కరాలు రావడంతో మంత్రి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాణహిత పుట్టి, ముగిసేది ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోనే. పుట్టేది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ముగిసేది మంచిర్యాల జిల్లా లో. దీంతో సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రాణహిత జన్మస్థలంలో కాకుండా మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో పుష్కరాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. తుమ్మిడిహెట్టిలో నిర్వహిస్తే కచ్చితంగా ఇక్కడ జనాలకు ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది ఓ రకంగా తలనొప్పి తెచ్చి పెట్టే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో రాజకీయంగా ఉన్న విభేదాలు కూడా తోడయ్యాయి. రెండోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత గురుశిష్యులుగా ఉన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మధ్య పోడు భూముల ఘటన దూరం పెంచింది. ఇంద్రకరణ్ రెడ్డి గురువారం చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి పుష్కరాల నిర్వహణ మీద మంచిర్యాలలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ మీటింగ్ ఉన్నరోజున ఇక్కడ ఇన్చార్జి మంత్రిగా హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడకు రాకుండా చెన్నూర్ లో సమీక్ష చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సర్కార్ ఇప్పటికైనా ప్రాణహిత పుట్టినిల్లుకు సముచిత స్థానం ఇవ్వాలని, పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
