కేసీఆర్​కు పీకే రిపోర్ట్

కేసీఆర్​కు పీకే రిపోర్ట్
  • సగం మంది ఎమ్మెల్యేలపై కూడా..

హైదరాబాద్, వెలుగు: ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, సగం మంది టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలపై కూడా నెగెటివ్​ టాక్​ ఉన్నదని సీఎం కేసీఆర్​కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్   వివరించినట్లు తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ కు వచ్చిన పీకే.. తాజా సర్వే రిపోర్టులతో కేసీఆర్ తో భేటీ అయ్యారని టీఆర్​ఎస్​ వర్గాలు వెల్లడించాయి. పార్టీ ఎమ్మెల్యేల్లో సగం మందికి పైగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని, వారిలో 35 మందిపై తీవ్ర వ్యతిరేకత ఉందని పీకే తెలిపినట్లు సమాచారం. గత డిసెంబర్ నుంచి నిర్వహిస్తున్న ప్రతి సర్వేలోనూ వారి పనితీరులో ఎలాంటి మార్పు లేదని చెప్పినట్టు తెలిసింది. గత సర్వేల్లో ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత కనిపించలేదని.. కానీ, ఈ మధ్య సర్కారు తీరుపైనా వ్యతిరేకత పెరుగుతున్నదని చెప్పినట్టు సమాచారం.  

ఆయా సర్వేల రిపోర్టులను కేసీఆర్ నిశితంగా పరిశీలించినట్లు, త్వరలో నిర్వహించే పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో సర్వే వివరాల ఆధారంగా ఆయా ఎమ్మెల్యేలను హెచ్చరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కేసీఆర్​, పీకే భేటీలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంపై ప్రజా స్పందన ఎలా ఉంది, ఢిల్లీ సర్కిల్స్ తో పాటు నేషనల్ మీడియా వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతున్నదనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికలపైనా చర్చించారని, ఢిల్లీలో మమతా బెనర్జీ నిర్వహించే ప్రతిపక్షపార్టీల సమావేశంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగిందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.