సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్న ప్రశాంత్

సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్న ప్రశాంత్

హైదరాబాద్ : యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కేసులో మే 17వ తేదీ బుధవారం రోజు ప్రశాంత్  సీసీఎస్ సైబర్ క్రైమ్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు సీసీఎస్ సైబర్ క్రైమ్ ఎదుట యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్ చార్జ్ ప్రశాంత్ హాజరుకానున్నారు. ప్రశాంత్ కి 41 CRPC కింద నోటీసులు ఇచ్చారు. 

ప్రశాంత్ తో పాటు మరో ముగ్గురు ఉద్యోగులు కూడా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తమపై ట్రోలింగ్ చేస్తున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసును విచారిస్తున్నారు. మరోవైపు.. మే 5వ తేదీన ఉత్తమ్ చేసిన ఫిర్యాదుతో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసు సోదాలు జరిపారు. ఐదు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 

ప్రశాంత్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా రూమ్ నడుస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ నుంచే కొంతమంది రాజకీయ నేతలపై ట్రోలింగ్ పోస్టులు అప్ లోడ్ అవుతున్నట్లు గుర్తించారు.