న్యూఢిల్లీ: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ఇతర లీడర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా అరెస్ట్ తర్వాత నిరసన బాధ్యతలను సంస్థ లీడర్ అజింక్య షిండే చేపట్టారు. శనివారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీజేపీ టాప్ లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకోగానే, సీజేపీ ఎక్స్ ఖాతాలో దీప్కే మాట్లాడిన ప్రీరికార్డెడ్ వీడియో విడుదలైంది.
అందులో దీప్కే మాట్లాడుతూ..‘‘మీరు ఈ వీడియో చూస్తున్నారంటే.. నేను, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా అరెస్టయ్యామని అర్థం. మేం తిరిగి రిలీజ్ అయ్యేంతవరకు సీజేపీ ఇంచార్జ్ అజింక్య ఈ నిరసనను, ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారు. దయచేసి ఆయనను అనుసరించండి” అని కోరారు. ఢిల్లీలో తనకు ఎలాంటి పరిస్థితి ఎదురుకానుందో దీప్కే ముందే ఊహించి, ఈ వీడియో రికార్డ్ చేశారు. అనంతరం షిండే ‘ఎక్స్’లో ఓ వీడియో రిలీజ్ చేశారు. మద్దతుదారులు ఎవరూ వెనకడుగు వేయకుండా జంతర్‌మంతర్ వైపు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ‘‘మన ఐక్యత చూసి ప్రభుత్వం భయపడుతోంది. దయచేసి అందరూ జంతర్ మంతర్‌కు రండి. మిమ్మల్ని పోలీసులు ఎక్కడ ఆపితే, ఆ ప్రదేశాన్నే జంతర్‌మంతర్‌గా మార్చండి” అని చెప్పారు.
ఎవరీ అజింక్య షిండే?
మహారాష్ట్రలోని అలీబాగ్ పట్టణానికి చెందిన అజింక్య షిండే గత కొన్ని సంవత్సరాలుగా దీప్కేకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. గతంలో ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) మహారాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేశారు.
ఆప్ కోసం పూర్తిస్థాయిలో పనిచేసేందుకు షిండే తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆప్‌లో చేరిన తర్వాత గోవా ఎన్నికల కోసం ఏడాదిపాటు శ్రమించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా తెరవకపోయినా.. పార్టీ పట్ల తన నిబద్ధతను కొనసాగిస్తూ మహారాష్ట్ర ఆప్ టీమ్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించారు.
రోజూ జంతర్ మంతర్ మార్చ్
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకూ ఆందోళన ఆపబోమని సీజేపీ నేత అజింక్య షిండే స్పష్టం చేశారు. శనివారం చేపట్టిన నిరసన ప్రదర్శనను పోలీసులు బలప్రయోగంతో అడ్డుకోవడం, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలను అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్ఞానేశ్‌ను తొలగించే వరకూ ఇకపై రోజూ ‘జంతర్ మంతర్ మార్చ్’ చేపడతామని ప్రకటించారు.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు అశుతోశ్ రాంకా, సౌరవ్ దాస్ ల అరెస్టును షిండే ఖండించారు. శాంతియుత నిరసనకు సిద్ధమైన వారిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. దీప్కే నాయనమ్మ మరణించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. దీప్కేకు ఆమె కడచూపు కూడా దక్కకుండా అడ్డుకుంటున్నారని, పోలీసుల తీరు అమానవీయంగా ఉందని షిండే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
