- రుక్సానాకు మెరుగైన వైద్యం అందించండి
- పాప తల్లికి గాంధీ దవాఖానలో ఉద్యోగం ఇవ్వండి
- సూపరింటెండెంట్ కు మంత్రి దామోదర ఆదేశాలు
పద్మారావునగర్, వెలుగు: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య వైద్యం చేయించే స్థోమత లేని తల్లి తన పాపను హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఆయన కార్యాలయ అధికారులు శనివారం గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారి రుక్సానాను, ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ హాస్పిటల్సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణితో ఫోన్‌లో మాట్లాడారు. పాపకు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు.
రుక్సానాకు పుట్టుకతోనే పెద్ద పేగు సమస్య ఉందని, జన్మించిన వెంటనే నిలోఫర్‌లో తొలి ఆపరేషన్చేశారని సూపరింటెండెంట్ చెప్పారు. ఇటీవలే గాంధీ దవాఖానలో మరో సర్జరీ విజయవంతంగా పూర్తి చేశామని, మరో 3 నెలల తర్వాత ఇంకో ఆపరేషన్చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య సేవల్లో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. భర్త విడిచిపెట్టి వెళ్లిపోవడంతో అద్దె ఇంట్లో ఉంటూ దొరికిన పని చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్లలను ఒంటరిగానే పోషిస్తున్నానని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్లే పాపను హుస్సేన్‌సాగర్‌లో విసిరేశానని పాప తల్లి అధికారుల ఎదుట కన్నీరుమున్నీరైంది.
తనకు ఏదైనా ఉపాధి కల్పించాలని ఆమె వేడుకోగా.. అధికారులు వెంటనే ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన.. చిన్నారికి గాంధీ దవాఖానలోనే పూర్తి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడంతోపాటు, ఆమె తల్లికి హాస్పిటల్లోనే అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. వారం రోజుల్లోనే ఆమెకు ఉద్యోగం కల్పిస్తామని సూపరింటెండెంట్ వెల్లడించారు.
టీఆర్ఎస్ చీఫ్ కవిత పరామర్శ
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్కల్వకుంట్ల కవిత శనివారం సికింద్రాబాద్‌గాంధీ దవాఖానకు వెళ్లి, చికిత్స పొందుతున్న రుక్సానాను పరామర్శించారు. పాపకు అందుతున్న వైద్యసేవల వివరాలను సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు.
