న్యూఢిల్లీ: ఇండియాలో బంగారం డిమాండ్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ అయ్యింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో మొదటిసారిగా ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ జ్యువెలరీ వినియోగాన్ని మించిపోయింది. స్టాక్ మార్కెట్ రాబడులు తగ్గిపోవడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా చూస్తున్నారు.
వీటిలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా, బంగారు నాణేలు, బార్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఆసక్తి పెరిగింది. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ ఏడాది లెక్కన 52శాతం పెరిగి 82 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. మరోవైపు, ధరలు పెరగడంతో జ్యువెలరీ కొనుగోళ్లు 19.5శాతం తగ్గి 66 టన్నులకే పరిమితమైంది.
మొత్తం బంగారం వినియోగం 10.2శాతం పెరిగి 151 టన్నులుగా ఉంది. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ 54.3శాతం వాటా సాధించింది. సాధారణంగా ఇది మొత్తం వినియోగంలో నాలుగో వంతు మాత్రమే ఉండేది. కానీ ఈసారి పెట్టుబడిదారులు ఎక్కువగా బంగారాన్ని ఎంచుకోవడంతో పరిస్థితి మారింది.
గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్‌ఫ్లోలు కిందటేడాది మార్చి క్వార్టర్‌తో పోలిస్తే ఈసారి 186శాతం పెరిగి రికార్డు స్థాయిలో 20 టన్నులకు చేరాయి. 2025 నుంచి ఇప్పటి వరకు దేశీయ బంగారం ధరలు దాదాపు రెట్టింపు కాగా, నిఫ్టీ 50 సూచీ కేవలం 2.4శాతం మాత్రమే పెరిగింది.

