ఐదు ఆస్పత్రులు తిరిగినా కనికరించలే.. అంబులెన్స్ లోనే గర్భిణి మృతి

ఐదు ఆస్పత్రులు తిరిగినా కనికరించలే.. అంబులెన్స్ లోనే గర్భిణి మృతి

సమయానికి వైద్యం అందక ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. కోవిడ్ భయంతో చికిత్స అందించడానికి ఆస్పత్రులు ముందుకు రాకపోవడంతో అయిదు హాస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అంబులెన్స్ లోనే ప్రాణాలు విడిచింది గర్భిణి. ఈ విషాద ఘటన హైదరాబాద్ మల్లాపూర్ లో జరిగింది. పావని అనే 8 నెలల గర్భిణికి శ్వాస ఎక్కువైందని మల్లాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కరోనా ఉండొచ్చనే అనుమానంతో చికిత్స చేయమని చెప్పారు ఆస్పత్రి సిబ్బంది. దీంతో  అంబులెన్స్ లో మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఎల్బీ నగర్ లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా బతకడం కష్టమని చెప్పారు డాక్టర్లు. కోఠికి గానీ, గాంధీ ఆస్పత్రికి గానీ తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో కోఠి ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మార్గం మధ్యలోనే అంబులెన్స్ లో ప్రాణాలు విడిచింది గర్భిణి. అప్పటికే తల్లిబిడ్డా ఇద్దరు  మృతి చెందారు. అంబులెన్స్ లో ఐదు ఆస్పత్రులు తిరిగినా వైద్యం అందక కళ్ల ముందే కూతురు ప్రాణాలు కోల్పోవడంతో బోరున విలపించింది ఆ తల్లి. ఇది ఇలా ఉంటే ..అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని మల్లాపూర్ శ్మశాన వాటికకు తీసుకెళ్తే.. అక్కడ లోపలికి రానివ్వలేదు. తల్లిని బిడ్డను వేరుచేస్తేనే దహనం చేస్తామని చెప్పారు. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్తే మృతదేహానికి ఆపరేషన్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఏమి చేయాలో తెలియక ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లింది తల్లి.