నొప్పులతో వస్తే.. తిప్పలువెడ్తరా

నొప్పులతో వస్తే.. తిప్పలువెడ్తరా

 

  •          పొద్దులు నిండగానే కరీంనగర్‌కు రెఫర్
  •           ప్రసవ వేదనతో గర్భిణుల విలవిల
  •           ఫలితమివ్వని కేటీఆర్ ఆకస్మిక తనిఖీ
  •           హెల్త్ సెక్రటరీతో మాట్లాడినా భర్తీ కాని గైనికాలజిస్టు పోస్టులు

టీఆర్‌ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలోని సిరిసిల్ల జిల్లా ఏరియా హాస్పిటల్‌లో ఈ అవస్థ ఈ ఒక్కరోజుది కాదు. గైనికాలజిస్టు లేక గర్భిణులు పడుతున్న కష్టాలపై మీడియాలో వార్తలు రావడంతో ఆగస్టు 2న కేటీఆర్ దవాఖానాను ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్‌కు వచ్చే ఏ ఒక్కరూ ఇబ్బందిపడకుండా చూసుకోవాలని డాక్టర్లు చెప్పారు. హెల్త్ సెక్రటరీతో ఫోన్లో అందరిముందే మాట్లాడి వెంటనే నాలుగు గైనికాలజిస్టు పోస్టులు భర్తీ చేయాలని.. కనీసం రెండేళ్లు పని చేసేలా చర్యలు తీసుకోవాలని.. లేకుంటే వారి డిగ్రీలు రద్దు చేస్తామని హెచ్చరించండంటూ చెప్పారు. కేటీఆర్ తనిఖీ, హామీలతో సమస్యలు పరిష్కారం అవుతాయని అందరూ సంతోషించారు. అయితే దవాఖానాలో ఉన్న ఒక్క గైనకాలజిస్ట్‌ డాక్టర్ సంగీత కూడా సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో ఇక్కడికి ట్రీట్‌మెంట్‌కు వచ్చే గర్భిణులకు కష్టాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం సిరిసిల్ల ఏరియా దవాఖానాలో ఒక్క గైనికాలజిస్టు కూడా లేరు. నెలకు 300 ప్రసవాలు అయ్యే ఈ హాస్పిటల్‌లో ప్రస్తుతం రోజుకు మూడునాలుగు డెలివరీలు చేస్తూ.. మిగతా వారిని కరీంనగర్‌కు రెఫర్ చేస్తున్నారు. అంతదూరం వెళ్లలేని వారు అప్పులు చేసి.. ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారు.

మందులూ అందట్లేదు

సిరిసిల్ల దవాఖానాలో ఐసీయూ, బ్లడ్ బ్యాంకు, డయాలసిస్ సెంటర్​వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన కేటీఆర్.. డాక్టర్లు, సిబ్బంది నియామకంలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. నూటికి 90శాతం కార్మికులు ఉన్న సిరిసిల్లలో వైద్యసేవలకు సర్కార్ దవాఖానాయే పెద్దదిక్కు. హాస్పిటల్‌కు నిత్యం 600 నుంచి700 ఓపీ ఉంటుంది. ఇందులో 200 పైగా గర్భిణులే ఉంటారు. 300 ఓపీ వచ్చినప్పుడు ప్రభుత్వం మందుల కోసం నెలకు రూ.3 లక్షల బడ్జెట్ కేటాయించేది. ఓపీ 600 నుంచి 700లకు పెరిగినా ప్రభుత్వం మాత్రం అదే రూ.3లక్షల బడ్జెట్ ఇస్తోంది. దీంతో దవాఖానాకు వచ్చే చాలా మందికి మందులు అందని పరిస్థితి.

ఆరుగురు గైనికాలజిస్టులు తప్పనిసరి..

ప్రస్తుతం గర్భిణుల ఓపీ సంఖ్యను అనుసరించి హాస్పిటల్‌కు ఆరుగురు గైనికాలజిస్టులు అవసరమని వైద్యాధికారులు చెబుతున్నారు. నెలకు 300కు డెలివరీలు అవుతుంటాయి. డిప్యుటేషన్​పై ఒకే ఒక గైనికాలజిస్టును కేటాయించడంతో పనిభారం చాలా ఎక్కువ ఉంది. దీంతో ఇక్కడ చేయడానికి డాక్టర్లు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. అవసరానికి తగ్గట్లు గైనికాలజిస్టును కేటాయిస్తే పనిభారం తగ్గుతుంది.

గైనికాలజిస్టుల కొరత ఉంది

హాస్పిటల్‌లో గైనికాలజిస్టుల కొరత ఉంది. ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. ప్రైవేట్ గైనిక్​ డాక్టర్లకు ప్రతి కేసుకు రూ.2500 చెల్లించి రోజుకు మూడునాలుగు ప్రసవాలు చేయిస్తున్నాం. సాధ్యం కానీ పరిస్థితుల్లో మాత్రమే కరీంనగర్‌కు రెఫర్ చేస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఆరుగురు గైనికాలజిస్టుల అవసరం ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా నివేదించాం.

– డాక్టర్ తిరుపతి, సూపరింటెండెంట్, సిరిసిల్ల సివిల్ హాస్పిటల్