ఎరువులు రెడీ చేయండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

ఎరువులు రెడీ చేయండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
  •      పంటసాగు, ఎరువుల నిల్వలపై సమీక్ష

హైదరాబాద్​, వెలుగు: వానాకాలం సీజన్​ పంట సాగుకు అవసరమైన ఎరువులను రెడీ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ పంట సాగు, ఎరువుల నిల్వలపై ఆయన గురువారం వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్​ అవసరాల కోసం 10.4 లక్షల టన్నుల యూరియా, 2.4లక్షల టన్నుల డీఏపీ, 10 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 0.60 లక్షల టన్నుల ఎంవోపీ ఎరువులను కేంద్రం కేటాయించిందని మంత్రి తెలిపారు. 

అవసరాలకు తగినట్లు నెలవారీగా కేటాయింపులు చేసిందని, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎరువుల సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు వరి నార్లు పోస్తున్నారని, త్వరలో నాట్లు వేస్తారని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వెల్లడించారు. ఇప్పటికే దుక్కి దున్నిన రైతులు పత్తి, కందితో పాటు ఇతర పంటలు వేయడం షురూ చేశారని చెప్పారు.