
- ఇరుముడితో వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
- పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ప్రధాన పూజారి
- రాష్ట్రపతి ప్రయాణించిన హెలికాప్టర్‌కు స్వల్ప ప్రమాదం
- ఆమె దిగిన వెంటనే కుంగిన చాపర్, తృటిలో తప్పిన ముప్పు
తిరువనంతపురం(కేరళ): ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము బుధవారం (అక్టోబర్ 23) శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రత్యేక కాన్వాయ్‌లో పంబా చేరుకుని గణేశుడి ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ ఆచారాల ప్రకారం ఇరుముడి కట్టుకుని 18 బంగారు మెట్లు ఎక్కి అయ్యప్ప సన్నిధికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ఇరుముడి సమర్పించారు. ఈ సందర్భంగా కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్, ఆలయ తంత్రీలు పూర్ణకుంభంతో ప్రెసిడెంట్ ముర్ముకు స్వాగతం పలికి, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రార్థనల తర్వాత ప్రెసిడెంట్.. మాలికాపురంతో సహా పక్కనే ఉన్న దేవాలయాలను సందర్శించారు. భోజనం చేశాక దేవస్థానం గెస్ట్‌హౌస్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని తిరువనంతపురం బయల్దేరారు. ప్రెసిడెంట్ సెక్యూరిటీగా వచ్చినవారుకూడా సాంప్రదాయాల ప్రకారం ఇరుముడితోనే ముర్ముతో కలిసి ఆలయ మెట్లు ఎక్కారు. కాగా, అయ్యప్పను దర్శించుకున్న తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించారు. ఆమె కంటే ముందు మాజీ ప్రెసిడెంట్ వీవీ గిరి 1970లలో అయ్యప్పను దర్శించుకున్నారు.
కొద్ది గంటల ముందే ప్లాన్ మార్పు..
శబరిమల కొండల సమీపంలోని పథనంతిట్ట జిల్లా నీలక్కల్‌లో హెలికాప్టర్ ల్యాండింగ్‌కు మొదట ప్లాన్ చేసిన అధికారులు, వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి నిమిషంలో అదే జిల్లాలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియానికి చేంజ్ చేశారు. దీంతో మంగళవారం రాత్రి అప్పటికప్పుడు హెలిపాడ్‌ను నిర్మించారు. బుధవారం ఉదయానికల్లా ఆ కాంక్రీట్ పూర్తిగా గట్టిపడకపోవడంతో హెలికాప్టర్ టైర్లు కుంగాయని సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. కాగా, హెలికాప్టర్‌ను సిబ్బంది తోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కుంగిన హెలికాప్టర్, తప్పిన ప్రమాదం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చిన రాష్ట్రపతి ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ స్వల్ప ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం 9.05 గంటల ప్రాంతంలో పథనంతిట్ట జిల్లాలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో ఆమె ప్రయాణిస్తున్న ఐఏఎఫ్‌కు చెందిన ఎంఐ17 ఛాపర్ ల్యాండ్ అయింది. ముర్ము దిగి వెళ్లిన కొద్ది సెకన్లలోనే హెలికాప్టర్ టైర్లు భూమిలోకి కుంగిపోయాయి.
కొత్తగా నిర్మించిన హెలిప్యాడ్‌లోని కాంక్రీట్ ఇంకా గట్టిపడకపోవడంతోనే ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఆ హెలికాప్టర్‌ను కాస్త ముందుకు తోసి సెట్ చేశారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన పంపా వరకు వెళ్లారు. హెలికాప్టర్ కుంగిన ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని అధికారులు తెలిపారు.