సమాజంలో మహిళలను చిన్న చూపు చూడకూడదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహిళలు, పురుషులు అందరూ సమానమే అని చెప్పారు. అర్ధ నారీశ్వరుడు లాగా మహిళ, పురుషుడు ఇద్దరు సమానమే అని చెప్పారు. విద్యార్థులకు, చిన్న పిల్లలకు బాల్యం నుంచే సంస్కారం నేర్పించాలన్నారు. పిల్లలకు చిన్నా, పెద్ద, మహిళల పట్ల ఎలా ఉండాలో తల్లి తండ్రులు నేర్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇన్ స్టిట్యూట్ ను సందర్శించిన ఆమె.. విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు.
విద్యార్థులకు వాల్యూ ఎడ్యుకేషన్ను అందించాలని ద్రౌపది ముర్ము సూచించారు. విద్యార్థులు సమాజంలో జరుగుతున్న పరిస్థితులను బేరీజు వేసుకుని ముందుకు వెళ్ళాలన్నారు. వందల , వేల కోట్లు ఉన్న ఏమి లాభం లేదని.....తినేది రెండు చపాతీలు, 6 గజాల స్థలంలోనే పడుకుంటారన్న ఆమె.. మనిషికి ఆత్మ సంతృప్తి ముఖ్యమన్నారు. మన సంస్కృతి మనకు గర్వకారణమన్నారు. మన మూలాలు మర్చిపోవద్దని కాపాడుకోవాలన్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. మనిషికి మనిషికి మధ్య ఆరోగ్య కరమైన పోటీ ఉండాలని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు.

