కుక్కలా విశ్వాసం చూపినట్లు నటిస్తూ.. నక్కలా మోసం చేస్తుండు

కుక్కలా విశ్వాసం చూపినట్లు నటిస్తూ.. నక్కలా మోసం చేస్తుండు

నల్గొండ, వెలుగు : సీఎం కేసీఆర్ ది మూడు జంతువుల కలయికతో కూడిన మనస్తత్వమని పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్​ రెడ్డి విమర్శించారు. మునుగోడు నియోజకవర్గ బూత్ ఇన్​చార్జీలతో ఆయన సమావేశం అయ్యారు. అనంతరం చౌటుప్పల్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ కుక్కలా విశ్వాసం చూపినట్లు నటిస్తూ.. నక్కలా మోసం చేస్తూ.. శవాలను పీక్కుతినే తోడేలు లాంటి వాడు. చౌటుప్పల్ చౌరస్తాలో 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టినా పాపం లేదు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​ను మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నడు. మిగిలిన నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తున్నడు” అని రేవంత్ మండిపడ్డారు. 

హామీలపై నిలదీయాలి

టీఆర్ఎస్ లీడర్లు ఓట్ల కోసం గ్రామానికొస్తే.. ఇచ్చిన హామీలపై నిలదీయాలని రేవంత్​ పిలుపునిచ్చారు. మునుగోడులో చర్లగూడెం, కిష్టరాయిపల్లి భూ నిర్వాసితులకు మల్లన్నసాగర్​ తరహాలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పక్షాన నిలబడిందని, కానీ ఈసారి వారు టీఆర్​ఎస్​తో పొత్తు కుదుర్చుకుని అన్యాయం చేసిందన్నారు. ఆ పార్టీ నాయకులు ఎవరికి మద్దతు ఇచ్చినా.. కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తోడుగా నిలబడాలని కోరారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హయాంలోనే మునుగోడు అభివృద్ధి చెందిందని తెలిపారు. ఆ సేవలను గుర్తు చేసుకునే ఆయన కూతురు స్రవంతికి టికెట్​ ఇచ్చామన్నారు. 

ఇంటింటి ప్రచారం నిర్వహించాలి

కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మోసం చేసి మోడీ పంచన చేరారని రేవంత్​ విమర్శించారు. ఈ  ఎన్నికల్లో ఆయనకు  ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా 17వ తేదీ నుంచి కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించాలని, 18వ తేదీ నుంచి అన్ని మండలాల ఇన్​చార్జిలతో ప్రతీ గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్​ చేశారు. 

సమన్వయంతో పని చేయాలి: మాణిక్కం ఠాగూర్​

అంతకుముందు బూత్​ ఇన్​చార్జీల సమావేశంలో మాణిక్కం ఠాగూర్​ మాట్లాడారు. మునుగోడు ఎలక్షన్​ను దుబ్బాకతో పోల్చొద్దని చెప్పారు. ఈ నియోజకవర్గంలో 300 బూత్​లు ఉన్నాయని, ప్రతీ బూత్​ ఇన్​చార్జి 254 ఓట్లు వేయిస్తే.. 76 వేల ఓట్లు కాంగ్రెస్​ పార్టీకి వస్తాయని చెప్పారు.  ప్రతి మండలం, గ్రామంలో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధాని అయ్యేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం లేదని, పార్టీకి పునర్జీవం తెచ్చేందుకు యాత్ర చేస్తున్నారని, అదే స్ఫూర్తితో మునుగోడులో గెలుపునకు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, సీనియర్​ లీడర్లు పాల్గొన్నారు.