హైదరాబాద్కు రాగానే తెలుగులో ప్రధాని ట్వీట్

హైదరాబాద్కు రాగానే తెలుగులో ప్రధాని ట్వీట్

హైదరాబాద్, వెలుగు: డైనమిక్​ సిటీకి వచ్చానంటూ ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్​ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్​కు చేరుకోగానే ఈ ట్వీట్​ చేశారు. ‘‘డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ నేషనల్​ ఎగ్జిక్యూటివ్​ మీటింగ్​లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై సమావేశాల్లో చర్చిస్తాం’’ అని తెలుగులో ట్వీట్​ చేశారు. తనకు స్వాగతం పలికిన గవర్నర్​ తమిళిసై, నేతల ఫొటోలను అదే ట్వీట్​తో పోస్టు చేశారు. గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్​ సోమేశ్​కుమార్, డీజీపీ మహేందర్​రెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్​  బేగంపేట ఎయిర్​పోర్టులో మోడీకి  స్వాగతం పలికారు.  అక్కడి నుంచి మాదాపూర్ లోని  హెచ్ఐసీసీకి ఆర్మీ హెలికాప్టర్​లో ప్రధాని బయల్దేరారు. హెచ్​ఐసీసీ వద్దకు ఆయన చేరుకోగానే..  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , ఎంపీ లక్ష్మణ్ , జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీలు జితేందర్​రెడ్డి, విజయశాంతితో పాటు పలువురు నేతలు స్వాగతం పలికారు. అనంతరం నోవాటెల్ హోటల్​కు వెళ్లిన మోడీ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యారు.