ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో పర్యటించారు. అక్కడ జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలోని ప్రజలు ‘మీ కమలం వికసిస్తోంది’ అంటున్నారంటూ కౌంటరిచ్చారు. తమపై, తమ పార్టీపై అభ్యంతరకరమైన పదజాలం, విమర్శలు చేసిన వారికి దేశం తగిన విధంగా సమాధానం చెబుతుందని హెచ్చరించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాను ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం ఛత్తీస్‌గఢ్ వెళ్లే విమానం ఎక్కకుండా అడ్డుకోవడంతో ఆ పార్టీ సభ్యులు మోడీపై వివాదాస్పద నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశంలో తిరస్కరణకు గురైన వారిని మళ్లీ అంగీకరించేందకు ప్రజలు సిద్ధంగా లేదంటూ మోడీ విమర్శించారు. ‘మోడీ సమాధి తవ్వుతాం అంటూ కాంగ్రెస్ నినాదాలు చేస్తున్నా.. దేశం మాత్రం మోడీ కమలమే వికసిస్తుందంటూ ఎలిగెత్తి చెబుతోంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా పేరును, ఆయన అరెస్టును ప్రస్తావించకుండా కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు.
కుటుంబమే ఫస్ట్ అంటూ కాంగ్రెస్ ముందుకెళ్తుంటే.. మేఘాలయ ప్రభుత్వం మాత్రం ప్రజలే ఫస్ట్ అనే నినాదానికి పిలుపునిస్తోందన్నారు. తన రోడ్ షోకు హాజరైన ప్రజలకు, పార్టీ శ్రేణులకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. తనపై చూపిన ప్రేమ, ఆశీర్వాదాలకు మేఘాలయాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చి.. కృతజ్ఞతలను చెల్లించుకుంటాం అని అన్నారు. మేఘాలయలో ఈనెల 27న నాగాలాండ్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
