ఆర్‌ఎఫ్‌సీఎల్ ను జాతికి అంకితమివ్వనున్న మోడీ

ఆర్‌ఎఫ్‌సీఎల్ ను జాతికి అంకితమివ్వనున్న మోడీ

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 12న పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బీఆర్కే భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మోడీ పర్యటన ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా నిర్వహించేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)‌ను మోడీ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. గతంలో మూతబడిన రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకుంది. మొత్తం రూ. 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. కాగా.. గతేడాది మార్చి 22న ఆర్ఎఫ్‌సీఎల్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినట్టుగా ప్రకటించింది. ఇప్పుడు నరేంద్ర మోడీ అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు.