ఆనందయ్యపై ప్రైవేట్ కంపెనీల ఒత్తిడి

ఆనందయ్యపై ప్రైవేట్ కంపెనీల ఒత్తిడి

కరోనా కట్టడికి ఆనందయ్య తయారు చేసిన మందు పంపిణీపై అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మందు ఫార్ములా చెప్పాలంటూ ప్రైవేట్ కంపెనీలు ఆయనపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించారు. ప్రజలకు ఉచితంగా అందించాలనే తన ఆధ్యాత్మిక ఉద్దేశాన్ని కంపెనీలు అడ్డుకుంటున్నాయని కేసు వేశాడు. 

మరోవైపు చేప మందు ప్రసాదం తరహాలో ఆనందయ్య తయారుచేసిన సాంప్రదాయ ఔషదం పంపిణీకి వెంటనే అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు... మందు పంపిణీ నిలిపివేయడంపై ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఆయుష్ విభాగం అధ్యయనం నివేదిక 29వ తేదీ వరకు వస్తుందని, అప్పటి వరకు తాత్కాలికంగా నిలిపివేయామని ఏపీ సర్కారు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మందుపై శాస్త్రీయ అధ్యయనాల లోతుకు వెళ్లి ఆలస్యం చేయొద్దని కోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మందు ప్రజలకు ఎలా అందజేయాలోనే విషయాన్ని పరిశీలించాలని, దీని సంబంధించిన వివరాలు తెలపాలని కోర్టు ఆదేశించింది. కాగా.. మందు పనితీరుపై ఆయుర్వేద కమిటీ రిపోర్ట్ రేపు వెలువడనుంది. దాంతో ఆ రిపోర్ట్ మీద అందరిలో ఆసక్తి నెలకొంది. 

ఇదిలా ఉంటే.. ఆనందయ్య తయారుచేసిన మందు అధ్యయనం పురోగతిపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు. ఆయుష్ ఇన్చార్జ్ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు,  ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ్‌లకు ఫోన్ చేసి మందు గురించి తెలుసుకున్నారు. ప్రజల విశ్వాసాల నేపథ్యంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశంగా పరిగణించి ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌తోనూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడారు. కరోనాను తగ్గిస్తుందనే నమ్మకంతో ఆనందయ్య మందును చేప మందు ప్రసాదం తరహాలో పంపిణీ చేయాలని స్థానికులు, కరోనా రోగులు కోరుతున్నారు.