ఎంసెట్‌‌ పూర్తవకముందే మేనేజ్‌‌మెంట్‌‌ సీట్లకు బేరం

ఎంసెట్‌‌ పూర్తవకముందే మేనేజ్‌‌మెంట్‌‌ సీట్లకు బేరం

కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఇష్టారాజ్యం

ఉన్నత విద్యామండలి పర్మిషన్ ఇవ్వకముందే అమ్మకాలు

సీట్లు చాలానే ఉన్నయ్.. ముందే చేరొద్దంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌‌ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎంసెట్‌‌ పరీక్ష పూర్తి కాక ముందే అడ్మిషన్లు స్టార్ట్‌‌ చేశాయి. మేనేజ్‌‌మెంట్‌‌ కోటా (బీ కేటగిరీ) సీట్లను అమ్ముకుంటున్నాయి. సర్కారు ఆదేశాలు, ఉన్నత విద్యా మండలి పర్మిషన్‌‌ ఇవ్వకుండానే సేల్స్‌‌ మొదలుపెట్టాయి. దీనిపై స్టూడెంట్ల యూనియన్లు, పేరెంట్స్‌‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి.

14న ఎంసెట్‌‌ పూర్తి

రాష్ట్రంలో 2020–21 విద్యా సంవత్సరానికి 186 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ పర్మిషన్‌‌ ఇచ్చింది. వీటిల్లో 1.05 లక్షల సీట్లున్నాయి. ఈ సీట్లకు సర్కారు ఆమోదం తెలిపిన తర్వాత వర్సిటీలు పర్మిషన్ ఇవ్వాలి. ఏఐసీటీఈ రెండు నెలల కిందటే అనుమతివ్వగా గవర్నమెంట్ ఇంకా ఎన్‌‌వోసీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. మరోవైపు ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈ నెల 9 నుంచి ఎంసెట్ ఎగ్జామ్‌ జరుగుతోంది. ఈ నెల14తో ఎంసెట్ (ఇంజినీరింగ్) ఎంట్రన్స్ ఎగ్జామ్ పూర్తవుతుంది. ఎంసెట్‌‌ ర్యాంకు ల ఆధారంగా కాలేజీల్లో కన్వీనర్ కోటాలో
సీట్లు కేటాయించాలి.

ఉన్నత విద్యామండలి పర్మిషన్‌‌ ఉండాలి

ప్రైవేటు కాలేజీల్లోని మొత్తం సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటా కింద సర్కారు భర్తీ చేస్తుండగా మిగతా 30 శాతం సీట్లు మేనేజ్‌‌మెంట్లు భర్తీ చేసుకుంటాయి. ఈ కోటా సీట్ల భర్తీలోనూ సర్కారు ఆదేశాలను ప్రైవేటు కాలేజీలు పాటించాల్సి ఉంటుంది. ఉన్నత విద్యామండలి పర్మిషన్‌‌తో కాలేజీలు ఈ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టూడెంట్ల నుంచి అప్లికేషన్లు తీసుకుని వాటిలో జేఈఈ, ఎంసెట్ ర్యాంకుల ప్రకారం అడ్మిషన్లు ఇవ్వాలి. ఈ కేటగిరీ సీట్లు భర్తీ కాకపోతే ఎంసెట్‌‌తో సంబంధం లేని వారికి ఇచ్చుకోవచ్చు.

మస్తుగ వసూలు చేస్తున్న మేనేజ్‌‌మెంట్లు

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు మాత్రం ఎంసెట్ పూర్తికాక ముందే మేనేజ్‌‌మెంట్ సీట్ల అమ్మకాలు షురూ చేశాయి. ఈ కోటా సీట్లకూ కన్వీనర్ ​కోటాలో నిర్ణయించినంత ఫీజునే తీసుకోవాల్సి ఉండగా.. దాంతో సంబంధం లేకుండా భారీగా ఫీజులు నిర్ణయించినట్టు పేరెంట్స్ ​చెబుతున్నారు. ఈ విషయాన్ని స్టూడెంట్స్ యూనియన్లు ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాళ్లు స్పందించకపోవడం గమనార్హం. ముందు వచ్చిన వారికి ఫీజులో రాయితీలుంటాయని మేనేజ్‌‌మెంట్లు ప్రచారం చేస్తుండటంతో పేరెంట్స్ కూడా ఆశపడుతున్నారు. ఎంసెట్‌‌లో మంచి ర్యాంక్‌ వస్తే మంచి కాలేజీలో సీటొస్తుందని, చాలా సీట్లున్నాయని, ముందే మేనేజ్‌‌మెంట్లతో మాట్లాడొద్దని పేరెంట్స్‌‌కు అధికారులు సూచిస్తున్నారు.

చర్యలు తీస్కుంటం

సర్కారు అనుమతి లేకుండా అడ్మిషన్లు చేపట్టొద్దు. నోటిఫికేషన్ ఇచ్చాక రూల్స్‌‌ ప్రకారం మేనేజ్‌‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేసుకోవాలి. ఇప్పటి నుంచే అడ్మిషన్లు చేపడితే కాలేజీలపై చర్యలు తీసుకుంటాం. ఇంజినీరింగ్ కాలేజీల్లో బాగానే సీట్లున్నాయి. పేరెంట్స్ తొందరపడొద్దు. -మంజూర్ హుస్సేన్, జేఎన్టీయూ రిజిస్ట్రార్‌‌