నీలోఫర్ ​గడ్డ.. యాపారానికి అడ్డా.. పార్కు స్థలంలో ప్రైవేట్​ మెడికల్​ షాపు.. తెల్లారేసరికి గోడలు లేపిన్రు

నీలోఫర్ ​గడ్డ.. యాపారానికి అడ్డా.. పార్కు స్థలంలో ప్రైవేట్​ మెడికల్​ షాపు.. తెల్లారేసరికి గోడలు లేపిన్రు
  • కలెక్టర్​, డీఎంఈ పర్మిషన్​ ఉందన్న సూపరింటెండెంట్​ 
  •  ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్న డీఎంఈ 

హైదరాబాద్/మెహిదీపట్నం, వెలుగు :హైదరాబాద్ నీలోఫర్ దవాఖాన వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే సీఎస్ఆర్ ఫండ్స్, బ్లడ్ బ్యాంక్ లో అక్రమాలతో వార్తల్లో నిలిచిన  దవాఖాన తాజాగా మరో వివాదంతో వార్తల్లోకెక్కింది.  హాస్పిటల్ ​ఆవరణలోని పార్కు స్థలంలో మంగళవారం రాత్రి నుంచి ఓ వ్యక్తి  ప్రైవేట్ మెడికల్ షాపు నిర్మాణ పనులు ప్రారంభించాడు.  

సర్కారు జాగాలో  ఎలాంటి పర్మిషన్లు లేకుండా అక్రమంగా కడుతున్నాడనే  ప్రచారంలో ఉంది.  ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు, ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.  అయితే,  షాపు నిర్మాణానికి వైద్యారోగ్య శాఖలో ఉన్నతాధికారుకు   పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి.  

గతంలో ఖాళీ చేశారు..మళ్లీ పాగా..  

2009లో నీలోఫర్  ఎదుట అద్దెకు ఓ ప్రైవేట్ మెడికల్ షాపు ఏర్పాటు చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీ చేయకపోవడంతో నిర్వహికులకు అధికారులు నోటీసులిచ్చారు. దీంతో షాపు ఓనర్​హైకోర్టుకు వెళ్లగా..  దవాఖానకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో షాపును ఖాళీ చేయించారు. ఇప్పుడు నీలోఫర్​లో కొత్త బిల్డింగ్ నిర్మిస్తుండడంతో ఆ షాపు ఉన్న పాత భవనాన్ని కూల్చేశారు.

దీంతో హాస్పిటల్ ఎంట్రన్స్ లో  పిల్లలు ఆడుకునే పార్కులో మంగళవారం (May 20) రాత్రి ​షాపు కోసం కొందరు హడావిడిగా నిర్మాణ పనులు చేపట్టారు. ప్రైవేట్ ​సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకుని బుధవారం తెల్లవారేసరికి గోడలు కట్టేశారు.  దీని వెనక పాత షాపు నిర్వాహకులు ఉన్నట్టు తెలుస్తోంది. 

ప్రైవేట్ మెడికల్ షాపులెందుకు?

 ప్రభుత్వ హాస్పిటల్స్​లోనే ప్రజలకు కావాల్సిన అన్ని రకాల మందులను ఉచితంగా ఇవ్వాలి.  ప్రభుత్వ ఫార్మసీలు ఉన్నప్పటికీ.. అక్కడ ఏర్పాటైన ప్రైవేట్ మెడికల్ షాపుల్లో రోజూ రూ. లక్షల్లో బిజినెస్ ​నడుస్తోంది. దీనికి వైద్యాధికారులు, ప్రముఖ రాజకీయ నేతలు సహకరిస్తున్నట్టు ఆరోపణలు 
వినిపిస్తున్నాయి.  

డీఎంఈ, కలెక్టర్​ పర్మిషన్ ​ఇచ్చారు  

హాస్పిటల్​ పార్కు స్థలంలో ప్రైవేట్ మెడికల్ షాపు నిర్మాణంపై సూపరింటెండెంట్​రవికుమార్ ను ​వివరణ కోరగా ‘ మెడికల్​ షాపు నిర్మిస్తున్నది నిజమే. దీనికి  డీఎంఈ, హైదరాబాద్ కలెక్టర్ నుంచి అనుమతులు వచ్చాయి.  కోర్టు  ఆర్డర్​ మేరకే  ఇస్తున్నాం.  టెంపరరీగా   పర్మిషన్ ​ఇచ్చాం.  నీలోఫర్ కు వచ్చే పేషెంట్లకు ఏ సమయంలోనైనా మందులు లభించాలన్నదే మా ఉద్దేశం’ అని అన్నారు. అయితే, పాతవారికే మెడికల్​షాపు కేటాయించాలంటూ కోర్టు ఆర్డర్ ​ఉందని చెప్పిన ఆయన..టెండర్ ​నిర్వహించకుండా ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు. 

 అనుమతులు ఇవ్వలేదు 

ప్రభుత్వ దవాఖానల ఏరియాలో జనరిక్ మెడికల్ షాపులకు మాత్రమే అనుమతులు ఇస్తారు. వాటిని కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఫైనల్ చేస్తుంది.  అల్లోపతి ఫార్మసీలకు పర్మిషన్లు అసలే ఇవ్వం. నీలోఫర్​లో ప్రైవేట్ మెడికల్​ షాపు నిర్మాణానికి  పర్మిషన్లు ఇవ్వలేదు. షాపు నిర్మాణం జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై సూపరింటెం డెంట్ ను వివరణ కోరాను. 
– డాక్టర్ నరేంద్రకుమార్, డీఎంఈ