
బషీర్ బాగ్, వెలుగు: ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో అధిక ఫీజుల దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని ఇండియన్ నేషనల్ యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు క్రాంతి కుమార్ కోరారు. బషీబాగ్ ప్రెస్ క్లబ్ లో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో బెదిరింపులకు పాల్పడే స్కూళ్లు, కాలేజీల మేనేజ్ మెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యాసంస్థలో ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ ను నోటీసు బోర్డులో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
విద్యార్థులు ఎవరైనా సూసైడ్ చేసుకుంటే కాలేజీలపై కేసులు నమోదు చేసి శిక్షించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టీసీలు, సర్టిఫికెట్స్, ఆన్ లైన్ ద్వారా కాకుండా డైరెక్ట్ గా బోర్డు నుంచే విద్యార్థులకు అందజేసేలా ప్రభుత్వం చూడాలని కోరారు. ఈ సమావేశంలో యువజన పార్టీ నాయకులు కునాల్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.