ప్రైవేటు టీచర్ల బ్లాక్ డే.. డీఈఓ ఆఫీసుల ఎదుట ఆందోళన

ప్రైవేటు టీచర్ల బ్లాక్ డే.. డీఈఓ ఆఫీసుల ఎదుట ఆందోళన

హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ కార్యాలయాల ఎదుట ప్రైవేటు టీచర్లు ఆందోళనలు నిర్వహించారు. టీచర్స్ డే ను బ్లాక్ డేగా ప్రకటించిన ప్రైవేట్ ఉపాధ్యాయులు తమ కష్టాలు ఎలుగెత్తి చాటే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా హైదరాబాద్ డీఈఓ కార్యాలయం ముందు నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

జీవో నెంబర్ 45 ప్రకారం ప్రైవేటు టీచర్లకు, నాన్-టీచింగ్ సిబ్బందికి యాజమాన్యాలు పూర్తి వేతనం చెల్లించాలి.. ప్రైవేట్ ఉపాధ్యాయుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి.. ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించడానికి ప్రభుత్వం ఒక రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేయాలి…  ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.. అని డిమాండ్ చేశారు. సర్కారు మాటలనే బేఖాతరు చేసే విధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాల మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు.  ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి… ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చి సత్కరించాలని కోరారు.