ప్రైవేటు టీచర్లు బయటకెళ్లలేక.. ఇళ్లలోనే దీక్షలు

ప్రైవేటు టీచర్లు బయటకెళ్లలేక.. ఇళ్లలోనే దీక్షలు

ఫోటోలు.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్

తమ గురువులను ఆదుకోవాలంటూ.. వైరల్ చేస్తున్న ప్రజెంట్, ఓల్డ్ స్టూడెంట్స్

కరోనా లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన ప్రైవేటు విద్యా సంస్థల టీచర్లు, లెక్చరర్లు తమ గళాన్ని గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణన్  టీచర్స్ డేను బ్లాక్ డే గా పిలుపునిచ్చిన నేపధ్యంలో తమ వంతు నిరసనలు చేపట్టి.. పాటించి.. ఇదిగో తమ కష్టాలు అంటూ బయటి ప్రపంచానికి గట్టిగా ఎలుగెత్తి చాటారు. జిల్లా కేంద్రాల్లో వీలున్న వారంతా డీఈఓ ఆఫీసులు.. ఇతర పట్టణాల్లో విద్యాశాఖ కార్యాలయాలు.. ధర్నా చౌక్ ల వద్దకు వెళ్లి నిరసనలు తెలియజేశారు. అయితే గ్రామీణ ప్రాంతాలతోపాటు.. చాలా మంది ఆర్ధిక ఇబ్బందులతో ఇళ్ల నుండి వెళ్లే వీలులేక పోయింది. అయితే వారు కష్టాలకు కుమిలిపోలేదు. తమ వంతుగా ఇళ్లలోనే డిమాండ్లతో ప్లకార్డులు రాసి.. పూల దండలు వేసుకుని నిరసన దీక్షలు ప్రారంభించి.. ఇదిగో మా నిరసన అంటూ.. తమకు తెలిసిన వారందరికీ ఫోటోలు.. వీడియోలు పంపుతున్నారు.

అండగా నిలుస్తున్న స్టూడెంట్స్, పేరెంట్స్

ఆత్మాభిమానాలతో.. ఆకలి దప్పుల కష్టాలను ఎదుర్కొనేందుకు నానా అగచాట్లు పడుతున్నతమ గురువులకు మేమున్నామంటూ తమవంతు అండగా నిలిచారు స్టూడెంట్స్.. పేరెంట్స్. ఒంటిరిగానైనా సరే ఆందోళనలు.. నిరసనలు తెలియజేస్తున్న తమ గురువుల ప్రయత్నాలను బయటి ప్రపంచానికి.. ముఖ్యంగా పాలకులకు అందరికీ తెలిసేలా ఇళ్లలో.. ఎక్కడ వీలైతే అక్కడ.. నిరసన దీక్షలు చేస్తున్న టీచర్లు.. లెక్చరర్ల ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరేలా షేర్ చేస్తున్నారు. కరోనాతో  గత 6 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలని  టీచర్స్ డే సందర్భంగా ఎవరి ఇంట్లో వారు నిరాహార దీక్షలు చేస్తున్న ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ అంటూ క్యాప్షన్స్.. కొటేషన్లు రాసి పంపిస్తున్నారు.

తమను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన వారి కోసం.. తమ కలాలకు పదునుపెట్టి నిరసనలకు అర్థం.. తెలిసేలా.. అందరూ స్పందించేలా చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అక్షర జ్ఙానం.. ఇంగింత జ్ఙానం.. లోక జ్ఙానం.. అందించేవారు.. ఎందరెందర్నో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది తను మాత్రం అదే స్థాయిలో ఉంటూ.. ఆనందపడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని ‘బాధ్యత’గా చేపట్టే వారే గురువులు..

ఉపాధి కోసం ప్రైవేట్ టీచర్ గా చేరి యాజమాన్యం ఆస్తులు కోట్లకు పడగలెత్తేలా చేశారు. చాలా మంది అరకొర జీతాలతో శ్రమను ధారపోసి యాజమాన్యాలకు సహకరించారు. వారిని ఆదుకోమని అడుగుతోంది ప్రభుత్వాన్ని. అయినా.. వీరికి జీతం ఎంత పొందాలో తెలియదు. హక్కుతో అడుగలేరు.

న్యాయంగా అయితే  విద్యార్థుల నుండి వసూలు చేసిన ఫీజు నుండి 50% ప్రయివేటు టీచర్లకు జీతాలు ఇవ్వాలి. అలా ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చారా?  లేదు.. వారు ఇవ్వరు. తమ గురువులు అడగలేరు అంటూ  ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టి..  షేర్ చేస్తున్నారు.