దేశవ్యాప్తంగా ప్రజలు రోజూ తినే వేయించిన శనగల్లో నిషేధిత ఇండస్ట్రియల్ రంగు ఆరమైన్ ఓ వాడకంపై శివ్ సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె కేంద్ర ఆరోగ్య మంత్రి, ఆహార ప్రాసెసింగ్ మంత్రికి లేఖ రాసి, ఇది ఆహార భద్రతా చట్టాల ఉల్లంఘన మాత్రమే కాకుండా కోట్లాది భారతీయుల ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పుగా మారినట్లు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో మార్కెట్లో అమ్మకానికి ఉన్న వేయించిన శనగలకు ఆకర్షనీయమైన పసుపు రంగులోకి రప్పించేందుకు ఆరమైన్ ఓ అనే డైను చట్టవిరుద్ధంగా కలుపుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. ఇంట్లో వేయించే శనగల రంగు కన్నా మార్కెట్లో కనిపిస్తున్న శనగలు అసాధారణంగా మెరిసిపోతూ కనిపించడం వల్ల సాధారణ వినియోగదారుడు మోసపోతున్నాడని సదరు వీడియోలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు ఎంపీ దృష్టికి వచ్చినట్లు తెలిస్తోంది.
ఆరమైన్ ఓ వాస్తవానికి టెక్స్ టైల్, లెథర్, పేపర్ ఇండస్ట్రీల్లో మాత్రమే వాడే సింథటిక్ పసుపు రంగు. దీన్ని ఆహార పదార్థాల్లో వాడటాన్ని భారత ప్రభుత్వం ఆహార భద్రతా ప్రమాణాల చట్టం–2006 కింద పూర్తిగా నిషేధించబడింది. అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ(IARC) కూడా ఈ డైను మనుషులకు క్యాన్సర్ ముప్పు కలిగించే పదార్థాల కేటగిరీలో చేర్చిన సంగతి తెలిసిందే. దీనిని తినటం వల్ల లివర్, కిడ్నీలు, మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
అయినప్పటికీ ఇటువంటి నిషేధిత రంగు వాడకం మార్కెట్లో కొనసాగుతుండటం ఆహార నియంత్రణ వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తన్నాయని ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనమైన మార్కెట్ పర్యవేక్షణ, సక్రమమైన పరీక్షలు లేకపోవటం, ఆలస్యంగా హెచ్చరికలు జారీ చేయడం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అమలులో నిర్లక్ష్యం వంటివే ఈ పరిస్థితికి కారణమని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. గతంలో కలుషిత దగ్గు మందుల కారణంగా అనేక దేశాల్లో పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. ఇలాంటి నిర్లక్ష్యాల్ని మళ్లీ జరగకుండా ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా అప్రమత్రం చేశారు ఎంపీ ప్రియాంక.
వెంటనే జాతీయ స్థాయిలో ఆరోగ్య హెచ్చరిక జారీ చేయాలని, దేశవ్యాప్తంగా వేయించిన శనగలు, బొంబాయి చిక్‌పీస్ వంటి సంబంధిత ఉత్పత్తులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నమూనాలు సేకరించి పరీక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై లైసెన్సు రద్దు నుంచి జైలు శిక్ష వరకు కఠిన చర్యలు తీసుకుంటే మాత్రమే ఇలాంటివి అడ్డుకోవచ్చన్నారు. అలాగే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పనిచేసే విధానంపై అంతర్గత ఆడిట్ జరిపి లోపాల్ని సరిదిద్దాలని చతుర్వేది సూచించారు.
