ఎట్టకేలకు గాంధీ పేషెంట్లకు రూ.80 భోజనం

ఎట్టకేలకు గాంధీ పేషెంట్లకు రూ.80 భోజనం

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్  డైట్​క్యాంటీన్​ టెండర్​కు సంబంధించిన సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. ప్రభుత్వం పెంచిన డైట్​చార్జీల వ్యవహారం వరుస కోర్టు కేసులతో ఏడాదిన్నర కాలంగా పెండింగ్​లో ఉండగా.. రెండోసారి నిర్వహించిన టెండర్​ ప్రక్రియ కోర్టు, ప్రభుత్వ జోక్యంతో ముగిసింది. దీంతో  ఇయ్యాల్టి నుంచి గాంధీ పేషెంట్లకు, డ్యూటీ డాక్టర్లకు కొత్త మెనూకు సంబంధించి ఫుడ్ సప్లయ్ కానుంది. ఇప్పటివరకు పేషెంట్లకు రూ.40, డాక్టర్లకు రూ.80కి  ఫుడ్ ఇస్తుండగా.. మరింత నాణ్యమైన ఫుడ్​ను అందించాలనే ఉద్దేశ్యంతో గతేడాది ఏప్రిల్​లో డైట్​చార్జీలను ప్రభుత్వం డబుల్ ​చేసింది. పేషెంట్లకు రూ.80, డాక్టర్లకు రూ.160ల భోజనం అందించాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాపత్రుల్లో కొత్తగా డైట్​టెండర్లు నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే, గాంధీలోని అప్పటి కాంట్రాక్టర్ కొత్త టెండర్ల నిర్వహణపై కోర్టుకు వెళ్లడంతో.. గాంధీలో ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కాలేదు. ఇటీవల అధికారులు తిరిగి రెండోసారి టెండర్​నిర్వహించగా, డైట్​క్యాంటీన్​ నిర్వాహకులు మళ్లీ కోర్టుకు వెళ్లారు. గాంధీ హాస్పిటల్​ను దృష్టిలో ఉంచుకొని డైట్ చార్జీలు పెంచితే.. చివరికి అక్కడే అమలు కావడం లేదని గ్రహించిన ప్రభుత్వం అన్ని లీగల్​ లిటిగేషన్లను పరిష్కరించింది. కోర్టు ఆదేశాలతో స్టేట్​ఫ్యామిలీ వెల్ఫేర్​కమిషనర్, జిల్లా డైట్ కమిటీ చైర్మన్ శ్వేతామహంతి ఆధ్వర్యంలో టెండర్​ బాక్సులు తెరిచారు. టెండర్​వేసిన ఆరుగురు కాంట్రాక్టర్లలో శ్రీవెంకటేశ్వర్​అసోసియేషన్​ కాంట్రాక్టర్​రవికుమార్​కు టెండర్ ​దక్కింది. గాంధీ సూపరింటెండెంట్ ​రాజారావు గురువారం రవికుమార్​కు కొత్త ఆర్డర్​ కాపీని అందచేశారు.