
హైదరాబాద్, వెలుగు: పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దాష్టీకాలు పెరుగుతున్నాయని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ బాబు అన్నారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లా డారు. పోడు రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంతో కేసీఆర్ కుర్చీ వేసుకుని పోడు పట్టాలు పంచుతానని చెప్పి, వారిని నిండా ముంచారని విమర్శించారు. ప్రభుత్వం పోడు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 30,40 ఏండ్ల నుంచి పోడు భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని, ఉన్న ఫలంగా భూములు లాక్కుంటే వారంతా ఆగమవుతారని చెప్పారు. పోడు రైతులు సంఘటితం కావాలని, అధికారుల అరాచకాలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పోడు రైతులకు అన్యాయం చేసేందుకు రేవంత్ సర్కారు సిద్ధం అవుతోందన్నారు. పోడు రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, పోరాటాలకు సిద్ధమవుతామని హరీశ్ బాబు హెచ్చరించారు.