- రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొ.కోదండరాం
పద్మారావునగర్, వెలుగు: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా దక్కకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఫైరయ్యారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ క్రైస్తవ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్ వైఎంసీఏలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. సామాజిక వివక్ష అన్ని మతాల్లో కొనసాగుతోందని, మతం మారినంత మాత్రాన దళితులపై అణచివేత తగ్గలేదన్నారు.
ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ.. అంబేద్కర్ కల్పించిన హక్కులు దళిత క్రైస్తవులకు అందకుండా చేయడం దారుణమన్నారు. అంటరానితనం, వేధింపుల కారణంగా చాలా మంది తమ గుర్తింపును బయటకు చెప్పుకోవడానికే భయపడుతున్నారని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గాలి వినోద్ కుమార్ అన్నారు. క్రైస్తవ సేవా సమితి అధ్యక్షుడు ఎం. సల్మాన్ రాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్, మేడే రాజీవ్ సాగర్, అడ్వకేట్ కదిరె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
