కేసీఆర్‌‌కు మళ్లీ అధికారం ఇవ్వద్దు : ప్రొఫసర్ హరగోపాల్

కేసీఆర్‌‌కు మళ్లీ అధికారం ఇవ్వద్దు : ప్రొఫసర్ హరగోపాల్

ఖైరతాబాద్, వెలుగు : కేసీఆర్‌‌కు మరోసారి అధికారం ఇవ్వొద్దని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బీజేపీ, బీఆర్‌‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకే దారిలో వెళ్తున్నాయన్న విషయం అందరికీ తెలిసిపోయిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్‌‌ను మళ్లీ గద్దెనెక్కే అవకాశం ఇవ్వద్దని, వారి వ్యతిరేకులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ బచావో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం జరిగింది. ‘సిరా చుక్క మౌనం వహిస్తే–సారా చుక్క రాజ్యమేలుతోంది.. మేధావులు మౌనం వహిస్తే –మూర్ఖులు రాజ్యమేలుతారు’ అనే అంశంపై ఆయన మాట్లాడారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రభుత్వాల నిర్భందాలను ఎదిరించి, లాఠీ దెబ్బలు, జైళ్లను సహించి 1,200 మంది బలిదానాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణలో పౌర సమాజానికి ప్రశ్నించేతత్వం కరువైందని, ప్రశ్నిస్తే నిర్భందిస్తున్నారని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బుకు, మందుకు లొంగి ఓట్లు వేయొద్దని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌ను గెలిపించకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వాలు మారితే సంక్షేమం ఆగదని, మరింత పెంచుతారని పేర్కొన్నారు.